టీమిండియా బొక్క బోర్లా!

టీమిండియా బొక్క బోర్లా!

India's Batting Failure Costs Them the First

ప్రతీకాత్మక చిత్రం

మలుపు తిప్పిన బవుమా, హార్మర్

గెలిచే మ్యాచ్‌లో ఓడిన గిల్ సేన

సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. మరోసారి స్పిన్ ఉచ్చులో పడి మూల్యం చెల్లించుకుంది. కోల్‌కతా వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా 30 పరుగుల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. స్పిన్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై సౌతాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ సిమన్ హర్మర్ నాలుగు వికెట్లతో భారత్ ఓటమిని శాసించాడు. 124 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్(92 బంతుల్లో 2 ఫోర్లతో 31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(0), కేఎల్ రాహుల్(1), ధ్రువ్ జురెల్(13), రిషభ్ పంత్(2), రవీంద్ర జడేజా(18), కుల్దీప్ యాదవ్(1 నాటౌట్), మహమ్మద్ సిరాజ్(0) తీవ్రంగా నిరాశపర్చారు. చివర్లో అక్షర్ పటేల్(26) దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. తీవ్ర మెడనొప్పితో శుభ్‌మన్ గిల్ ఆసుపత్రిపాలైన సంగతి తెలిసిందే. దాంతో అతను బ్యాటింగ్‌కు రాలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో సిమన్ హర్మర్(4/21)తో పాటు మార్కో జాన్సన్(2/15), కేశవ్ మహరాజ్(2/37) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఎయిడెన్ మార్క్‌రమ్ ఒక వికెట్ దక్కింది. టెంబా బవుమా కెప్టెన్సీలో సౌతాఫ్రికా జైత్రయాత్ర కొనసాగుతోంది. టెస్ట్‌ల్లో అతని సారథ్యంలో సౌతాఫ్రికా ఒక్క మ్యాచ్ కూడా ఓడలేదు. ఈజీగా మ్యాచ్ గెలుస్తామనే అత్యుత్సాహం కూడా టీమిండియా కొంపముంచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకు ఆలౌటైంది. ఎయిడెన్ మార్క్‌రమ్(48 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 31), వియాన్ మల్డర్(51 బంతుల్లో 3 ఫోర్లతో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(5/27) ఐదు వికెట్లతో సఫారీ పతనాన్ని శాసించగా.. మహమ్మద్ సిరాజ్(2/47), కుల్దీప్ యాదవ్(2/36) రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ దక్కింది. అనంతరం భారత్‌ 189 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్(119 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 39), వాషింగ్టన్ సుందర్(82 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 29) టాప్ స్కోరర్లుగా నిలిచారు. రిషభ్ పంత్(45 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27), రవీంద్ర జడేజా(45 బంతుల్లో 3 ఫోర్లతో 27) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్(3/35), సిమన్ హర్మర్(4/30) భారత్ పతనాన్ని శాసించగా.. కేశవ్ మహరాజ్, కోర్బిన్ బోష్ చెరో వికెట్ పడగొట్టారు. 30 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 153 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ టెంబా బవుమా(136 బంతుల్లో 4 ఫోర్లతో 55 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. కార్బిన్ బోష్(37 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25) అండగా నిలిచాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(4/50) నాలుగు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్(2/30), మహమ్మద్ సిరాజ్(2/2) రెండేసి వికెట్లు పడగొట్టారు. జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్‌కు చెరో వికెట్ దక్కింది. దాంతో భారత్ ముందు 124 పరుగుల లక్ష్యం నమోదైంది. బవుమా, కార్బిన్ బోష్ 8వ వికెట్‌కు 44 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యం మ్యాచ్‌ను సౌతాఫ్రికావైపు మలుపు తిప్పింది.


పెళ్లిపై మరోసారి త్రిష హాట్ కామెంట్స్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్