డెఫ్లింపిక్స్‌లో ధనుష్‌కు పసిడి
ధనుష్ శ్రీకాంత్
ప్రభుత్వం రూ.1.20 కోట్ల నజరానా
పారా షూటర్ ధనుశ్ శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు. డెఫ్లింపిక్స్ క్వాలిఫికేషన్‌లో రికార్డు బ్రేక్ చేసిన ఈ తెలంగాణ యంగ్‌స్టర్.. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం ఫైనల్లో విజేతగా నిలిచాడు. 251.7 పాయింట్లతో పసడి పతకం పట్టేశాడు శ్రీకాంత్. రాష్ట్రం గర్వించే విజయాన్ని సాధించిన శ్రీకాంత్‌కు భారీ నజరానా ప్రకటించింది ప్రభుత్వం. అంతర్జాతీయంగా అదరగొడుతున్న శ్రీకాంత్‌కు ప్రోత్సాహకంగా రూ. 1.20 కోటి నగదు ఇస్తామని క్రీడా మంత్రి వాకటి శ్రీహరి చెప్పారు. పంతొమ్మిదేళ్ల వయసులోనే డెఫ్లింపిక్స్‌లో అరంగేట్రం చేసిన ధనుశ్ శ్రీకాంత్ గోల్డ్ మెడల్ సాధించి వార్తల్లో నిలిచాడు. ఇటీవల టోక్యోలో జరిగిన డెఫ్లింపిక్స్ 25వ సమ్మర్ పోటీల్లో ధనుశ్ రికార్డులు బద్దలు కొట్టాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో తన గురికి తిరుగులేదని చాటుతూ గోల్డ్ మెడల్ కొల్లగొట్టాడు. క్వాలిఫికేషన్‌లో 252.2 పాయింట్లతో సత్తా చాటిన శ్రీకాంత్ ఫైనల్లోనూ రాణించాడు. పసిడి పతకమే లక్ష్యంగా గన్ అందుకున్న అతడు ఫైనల్లో 251.7 పాయింట్లతో విజేతగా అవతరించాడు. ఇదే పోటీల్లో భారత్‌కే చెందిన మొహమ్మద్ ముర్తాజా వనియా రెండో స్థానంతో వెండి పతకం గెలుచుకున్నాడు.