మహిళల క్రికెట్ అభివృద్దికి పలు చర్యలు తీసుకుంటున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. వన్డే ప్రపంచకప్ చాంపియన్‌గా అవతరించిన టీమిండియా క్రికెటర్లకు ప్రోత్సాహకంగా మ్యాచ్ ఫీజులను పెంచనుంది.
ప్రతీకాత్మక చిత్రం
కోహ్లీ, రోహిత్ గ్రేడ్ మార్చే అవకాశం
22న సమావేశంలో నిర్ణయాలు
మహిళల క్రికెట్ అభివృద్దికి పలు చర్యలు తీసుకుంటున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. వన్డే ప్రపంచకప్ చాంపియన్‌గా అవతరించిన టీమిండియా క్రికెటర్లకు ప్రోత్సాహకంగా మ్యాచ్ ఫీజులను పెంచనుంది. డిసెంబర్ 22 న జరుగనున్న సమావేశంలో మ్యాచ్ ఫీజుల సవరణ అంశం ప్రధానంగా చర్చకు రానుంది. ఈమధ్యే స్వదేశంలో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. మహిళా క్రికెట్ చరిత్రలో తొలి ఐసీసీ ట్రోఫీతో దేశం గర్వపడేలా చేసింది హర్మన్‌కౌర్ బృందం. దాంతో.. దేశవాళీలో మహిళా క్రికెటర్లకు వేతనాలు పెంచాలనే నిర్ణయానికొచ్చింది బీసీసీఐ. ప్రస్తుతం డొమెస్టిక్ మ్యాచ్‌లకు చెల్లిస్తున్న మ్యాచ్ ఫీజుల సవరణపై డిసెంబర్ 22 న వర్చువల్‌గా జరిగే సమావేశంలో బీసీసీఐ ప్రతినిధులు చర్చించనున్నారు. ఇదే మీటింగ్‌లో భారత పురుషుల జట్టు ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ అంశం కూడా తెరపైకి రానుంది. టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గ్రేడ్ మారే అవకాశముంది. ప్రస్తుతం ఏ ప్లస్ విభాగంలో ఉన్న వీరిని ఏ గ్రేడ్‌కు మారుస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంపైర్లు, మ్యాచ్ రిఫరీల జీతాల పెంపుపై కూడా బీసీసీఐ పెద్దలు నిర్ణయం తీసుకోనున్నారు. అయితే.. పురుషులతో పోల్చితో మహిళా క్రికెటర్లకు దేశవాళీ ఫీజులు తక్కువే ఉండే అవకాశముంది.
సమావేశం ఎజెండా ఇదే..
1. బీసీసీఐ సమావేశం 30వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించడం.
2. మహిళా క్రికెటర్లకు దేశవాళీలో మ్యాచ్ ఫీజుల సవరణ.
3. బీసీసీఐ డిజిటల్ ఆస్తులు (వెబ్‌సైట్, డొమైన్స్, యాప్స్, సోషల్‌మీడియా ఖాతాలు) వంటివి అప్డేట్ చేయడం.
4. అంపైర్లు, రిఫరీల మ్యాచ్ ఫీజుల్లో సవరణ.
5. క్రికెటర్ల వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ పునరుద్దరణ.
6. బీసీసీఐ అధ్యక్షుడు ఒకవేళ ఏదైనా అత్యవసరమైన విషయాన్ని ప్రస్తావిస్తే.. దాన్ని ఎజెండాలో చేర్చే అవకాశముంది.
పురుషుల గ్రేడ్స్ ఇలా..
ఏ ప్లస్ గ్రేడ్: రూ.7 కోట్లు
ఏ గ్రేడ్: రూ.5 కోట్లు
బీ గ్రేడ్: రూ.3 కోట్లు
సీ గ్రేడ్: రూ.1 కోటి