అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇండో-చైనా సరిహద్దుకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 21 మంది కార్మికులతో వెళుతున్న ఓ ట్రక్కు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది.
ప్రతీకాత్మక చిత్రం
అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇండో-చైనా సరిహద్దుకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 21 మంది కార్మికులతో వెళుతున్న ఓ ట్రక్కు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 17 మంది కార్మికులు మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. అంజావ్ జిల్లాలోని హయులియాంగ్-చగ్లాగం రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే... ఈ ప్రమాదం వాస్తవానికి సోమవారం జరగ్గా, మూడు రోజుల తర్వాత ఈరోజు వెలుగులోకి వచ్చింది. ట్రక్కుతో పాటు లోయలో పడిపోయిన వారిలో ప్రాణాలతో బయటపడిన ఓ కార్మికుడు, తీవ్ర గాయాలతో సమీపంలోని పట్టణానికి చేరుకున్నాడు. అక్కడ అధికారులకు సమాచారం అందించడంతో ఈ విషాద ఘటన గురించి బాహ్య ప్రపంచానికి తెలిసింది. ఈ విషయాన్ని అంజావ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ మిల్లో కోజిన్ ధృవీకరించారు. ప్రమాదం జరిగిన ప్రదేశం అంతర్జాతీయ సరిహద్దుకు 45 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 10,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉందని ఆయన తెలిపారు. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలపై దృష్టి సారించారు.