సీఎం రేవంత్ రెడ్డిది 3 రూపాయల మైండ్‌సెట్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు చేశారు. ‘ఓయూ అంటే కన్నతల్లి లాంటిది. ఓయూకు వెళితే రేవంత్ రెడ్డి ఏవో నాలుగు మంచి మాటలు మాట్లాడతాడని అనుకుంటే ఓయూకు వెళ్లినా తీరు మారలేదు’ అని మండిపడ్డారు.
దాసోజు శ్రవణ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు తీవ్ర విమర్శలు
హైదరాబాద్, డిసెంబర్ 11 (ఈవార్తలు): సీఎం రేవంత్ రెడ్డిది 3 రూపాయల మైండ్‌సెట్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు చేశారు. ‘ఓయూ అంటే కన్నతల్లి లాంటిది. ఓయూకు వెళితే రేవంత్ రెడ్డి ఏవో నాలుగు మంచి మాటలు మాట్లాడతాడని అనుకుంటే ఓయూకు వెళ్లినా తీరు మారలేదు’ అని మండిపడ్డారు. పొంతన లేని విషపూరితమైన ప్రసంగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌పై ప్రత్యక్షంగా.. పరోక్షంగా ద్వేషం వెదజల్లడానికి రేవంత్ రెడ్డి ప్రతీ వేదికను దుర్వినియోగం చేస్తున్నాడని తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహిచిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను క్రూరుడిని అనే సందేశాన్ని రేవంత్ రెడ్డి ప్రతీసారి ఇస్తున్నాడని.. నల్లమలకు రేవంత్ రెడ్డికి సంబంధమే లేదని ప్రకటించారు. ఉస్మానియాలో తెలంగాణ ఉద్యమం గురించి.. ఉద్యమంపై తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్ మాట్లాడటమా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిలాంటి తెలంగాణ ద్రోహుల వల్లే యాదయ్య, వేణుగోపాల్ రెడ్డి ప్రాణాలు తీసుకున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి బుద్ధి మాత్రం వంకర బుద్దేనని మండిపడ్డారు. రేవంత్ ది ఫ్యూడల్ మనస్తత్వం.. తమ ఇంటి ముందు నుంచి ఎవరూ వెళ్లినా చెప్పులు విడిచి వెళ్లాల్సిందేనని ఇదే రేవంత్ గతంలో చెప్పారని గుర్తుచేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో కేసీఆర్ స్థాపించిన గురుకులాలను నిర్వీర్యం చేస్తున్నారని.. రెండున్నర లక్షల మందికి నాణ్యత గల విద్య నందించే పేరుతో మిగతా 15 లక్షల మందికి విద్యను దూరం చేస్తావా? అని నిలదీశారు. సామాజిక న్యాయంపై రేవంత్ రెడ్డిది పెద్ద డ్రామా.. 42 శాతం రిజర్వేషన్లపై బీసీల గొంతు కోసి రేవంత్ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. కాంగ్రెస్‌లో బీసీ నాయకుల గొంతు కోశారు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. 'స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు చూస్తే కొండంత రాగం తీసి గాడిద పాట పాడినట్టు ఉంది. స్కిల్ యూనివర్సిటీలో పట్టుమని పది కోర్సులు కూడా లేవు' అని వివరించారు. ‘స్పోర్ట్స్ యూనివర్సిటీకి తెలంగాణ నుంచి నిపుణులు లేరని కేరళ నుంచి ఒకాయనను తెచ్చి రేవంత్ వీసీగా నియమించారు. గ్లోబల్ సమ్మిట్‌లో రేవంత్ ఇంగ్లీష్‌లో మాట్లాడొచ్చు. ఓయూకు వచ్చి ఇంగ్లీష్ అవసరం లేదు అంటాడు రేవంత్ రెడ్డి. తనకు రాని ఇంగ్లీష్ ఇంకెవరికి రావొద్దు అనేది రేవంత్ రెడ్డి విధానం’ అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. అసలు తెలివి ఉండే రేవంత్ మాట్లాడుతున్నాడా? అని మండిపడ్డారు. ఐటీలో ఇన్ని లక్షల మంది పని చేస్తున్నారంటే వారు నేర్చుకున్న ఇంగ్లీషే కారణం అనేది రేవంత్ రెడ్డికి తెలియదా? అని నిలదీశారు. ‘3 ట్రిలియన్ ఎకానమీ అంటాడు. రేవంత్ రెడ్డి మూడు రూపాయల మైండ్ సెట్‌తో సాధ్యమవుతుందా? 2047 విజన్ డాక్యుమెంట్ ఓ పక్క విడుదల చేస్తూ ఇంగ్లీష్ వద్దంటున్న రేవంత్ రెడ్డిని చూసి నవ్వాలా, ఏడవాలా?' అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. 'గ్లోబల్ సమ్మిట్‌లో రేవంత్ ధరించిన బట్టలు చూసి ఎవడైనా పెట్టుబడులు పెడతారా? కేసీఆర్ మీద విషం చల్లే మాటలు మానేస్తే రేవంత్ రెడ్డికే మంచిది’ అని పేర్కొన్నారు.