కార్పొరేట్ల కోసమే కొత్త విత్తన బిల్లు

కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్న విత్తన బిల్లును వెంటనే ఆపివేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

KTR

కేటీఆర్

బడా కంపెనీల ప్రయోజనాలకే పెద్దపీట

విదేశీ విత్తనాలు దేశంలోకి వచ్చే ప్రమాదం

ఈ బిల్లును అంతా వ్యతిరేకించాలి: కేటీఆర్

హైదరాబాద్, డిసెంబర్ 11 (ఈవార్తలు): కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్న విత్తన బిల్లును వెంటనే ఆపివేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఎలాంటి ట్రయల్స్ లేకుండా విదేశీ విత్తనాలు దేశంలోకి వచ్చే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతే కేంద్రంగా, రైతు ప్రయోజనాలే పునాదిగా నూతన విత్తన బిల్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. విత్తనాల అంశంలో రాష్ట్రాల పాత్ర లేకుండా చేస్తున్న ఈ బిల్లును అందరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. రైతు సంఘాలతో పాటు విత్తన నిపుణులు, వ్యవసాయ రంగ నిపుణులు, రాజకీయ పార్టీలతో కూలంకషమైన చర్చ తర్వాతనే ఈ బిల్లుపై ముందుకు పోవాలని కేంద్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి కేటీఆర్‌ సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విత్తన బిల్లు డ్రాఫ్ట్‌పై బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఈ సందర్భంగా కీలక ప్రకటన విడుదల చేశారు. కొత్త విత్తన బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విత్తన బిల్లు ముసాయిదాను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్రం ప్రతిపాదిస్తున్న ఈ విత్తన బిల్లుతో రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతుందని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ బిల్లును పూర్తిగా ఆపివేసి, రైతులు, రైతు సంఘాలు, నిపుణులతో, రాజకీయ పార్టీలతో చర్చించిన అనంతరం ఈ బిల్లుపై ముందుకుపోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విత్తన బిల్లులో నకిలీ విత్తనాలను కట్టడి చేసే అంశంపై స్పష్టత లేదని.. నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు నిర్దిష్ట సమయంలోనే నష్టపరిహారం అందించే అంశంపై గ్యారంటీ లేదని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా విత్తనాల ధరలను నిర్ణయించేలా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయని తెలిపారు. విత్తనాల ధరల నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకుండాపోతుందని కేటీఆర్ చెప్పారు. నకిలీ విత్తనాల తయారీలో కంపెనీలను బాధ్యులను చేయకుండా, కేవలం అమ్మకదారులను బాధ్యత వహించేలా, కేవలం సప్లై చైన్‌పై నకిలీ విత్తనాల బాధ్యతను ఉంచేలా ఈ చట్టం రూపొందించిందని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నకిలీ విత్తనాలకు సంబంధించిన అంశంలో జాతీయ స్థాయిలో ఆయా కంపెనీలను బ్లాక్‌లిస్ట్ చేయడం, భారీ పెనాల్టీలు, కఠిన జైలు శిక్ష వంటి అంశాలకు ఇందులో పెద్దగా ఆస్కారం లేదని కేటీఆర్ ప్రస్తావించారు. రైతుల సమూహానికి ఈ బిల్లులో ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని.. విదేశాల నుంచి నేరుగా ఆయా కంపెనీలు ఎలాంటి విత్తన ట్రయల్స్ లేకుండానే దేశంలో తమ విత్తనాలను అమ్ముకునేలా సులభమైన నిబంధనలు ఉన్నాయని వెల్లడించారు. ఈ బిల్లు వస్తే దేశీయ విత్తన భద్రత, విత్తన సార్వభౌమత్వం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి రాష్ట్రాలకు, రాష్ట్రంలోని వ్యవసాయ యూనివర్సిటీలకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా చేశారని చెప్పారు. ఈ బిల్లుతో వ్యవసాయ రంగంలో కీలకమైన విత్తనాల అంశంపై కేంద్ర ఆధిపత్యానికి దారితీస్తుందని.. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాలు సొంత చట్టాలు చేసుకుని ముందుకుపోయే అంశాన్ని బలహీనం చేస్తుందని ప్రస్తావించారు. త్వరలోనే ఈ అంశంపై మాజీ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ వినోద్ కుమార్‌తో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో చర్చించి కేంద్రానికి మరిన్ని సూచనలు ఇస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.


విభూది వస్త్రం.. త్రిశూలమే అస్త్రం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్