10 స్లాట్లు..రూ.25 కోట్లు
ప్రతీకాత్మక చిత్రం
కావ్యమారన్ ప్లాన్ ఏంటి?
ఐపీఎల్ 2026 వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్‌హెచ్) కేవలం 15 మంది ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవడంతో 10 ఖాళీ స్లాట్లతో వేలంలోకి దిగుతున్న ఏకైక జట్టుగా నిలిచింది. ఈ అనూహ్య నిర్ణయంపై సోషల్ మీడియాలో 'ఆరెంజ్ ఆర్మీ' ఫ్యాన్స్ నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఇది ఒక సాహసోపేతమైన అడుగుగా కొందరు భావిస్తుంటే.. మరికొందరు జట్టు పర్స్ బ్యాలెన్స్, కెప్టెన్సీ లేమిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎక్కువ మంది ఆటగాళ్లను విడుదల చేసి 10 స్లాట్లను ఖాళీగా ఉంచడం జట్టు యాజమాన్యం తెలివైన వ్యూహంగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సారి పాత తప్పులను రిపీట్ చేయకుండా జట్టుకు సరిగ్గా సరిపోయే సరికొత్త స్టార్లను ఎంచుకునే అవకాశం దొరికిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దీని వల్ల తమకు నచ్చిన ప్లేయర్లను కచ్చితంగా కొనుగోలు చేయవచ్ని ఆరెంజ్ ఆర్మీ ట్వీట్లు చేస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ.25.5 కోట్లు మాత్రమే పర్స్ బ్యాలెన్స్ ఉంది.10 మందిని కొనుగోలు చేయాల్సి ఉన్నందున ప్రతి ఆటగాడికి రూ.2.5 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలరు. ఈ అంశంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క స్టార్ ప్లేయర్ కోసం రూ.8-10 కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన 9 మందిని కనీస ధరకు కొనాల్సి వస్తుంది. కాబట్టి పెద్ద స్టార్ల కోసం కాకుండా తక్కువ ధరలో లభించే మంచి దేశీయ ఆటగాళ్లపై దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. రిటెన్షన్ జాబితాలో కెప్టెన్సీ అభ్యర్థి గురించి ఎలాంటి స్పష్టత లేకపోవడం అభిమానులను కలవరపెడుతోంది. వేలంలో అనుభవజ్ఞుడైన కెప్టెన్సీ ఎంపికపై దృష్టి సారించాలని లేదా జట్టులోని సీనియర్ ఆటగాడికి బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు. కెప్టెన్సీని పరిష్కరించకుండా జట్టు సమతుల్యత సాధించడం కష్టమని వారు అభిప్రాయపడుతున్నారు. అభిమానుల అంచనాలు, జట్టు అవసరాల దృష్ట్యా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం డిసెంబర్ 16న ఈ క్రింది కీలక అంశాలపై దృష్టి సారించవచ్చు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ముఖ్యంగా మిడిలార్డర్‌లో స్థిరమైన భారత బ్యాటర్లు లేరు. అందువల్ల రిలీజ్ చేయబడిన స్టార్ భారత బ్యాటర్ల కోసం పెద్ద మొత్తంలో బిడ్ వేసే అవకాసం ఉంది. యువ, నిరూపితమైన భారత బ్యాటర్ల వైపు మొగ్గు చూపాలని అభిమానులు బలంగా కోరుతున్నారు. జట్టు సమతుల్యత కోసం ఒక అగ్రశ్రేణి విదేశీ ఆల్‌రౌండర్ అవసరం ఉంది. ఇతను బంతితోనూ, బ్యాట్‌తోనూ రాణించగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి. ఇందుకోసం ఎక్కువ పర్స్‌ను ఖర్చు చేయడానికి వెనుకాడకపోవచ్చు. జట్టు వద్ద కేవలం 2 విదేశీ స్లాట్‌లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. రిటెన్షన్ లిస్ట్ బట్టి చూస్తే, ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మరింత లోతు అవసరం కావచ్చు. కాబట్టి ఒక మంచి దేశీయ స్పెషలిస్ట్ స్పిన్నర్ లేదా విదేశీ ఫాస్ట్ బౌలర్ కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం, కొత్త కోచింగ్ సిబ్బంది ఈ 10 ఖాళీ స్లాట్లను ఎలా ఉంపయోగించుకుంటారనే దానిపైనే 2026 సీజన్‌లో జట్టు ప్రదర్శన ఆధారపడి ఉంటుంది. వేలం రోజున సన్‌రైజర్స్ హైదరాబాద్ తీసుకునే నిర్ణయాలు కీలకం కానున్నాయి.