ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అత్యవసర సమయాల్లో రియల్‌టైమ్ వీడియోను షేర్ చేసేలా ఎమర్జెన్సీ లైవ్ వీడియో పేరిట ఈ ఫీచర్‌ను పరిచయం చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అత్యవసర సమయాల్లో రియల్‌టైమ్ వీడియోను షేర్ చేసేలా ఎమర్జెన్సీ లైవ్ వీడియో పేరిట ఈ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఆండ్రాయిడ్ ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్ (ఈఎల్‌ఎస్)పై ఇది పనిచేస్తుందని గూగుల్ తెలిపింది. ఎమర్జెన్సీ సేవలకు సంబంధించిన కాల్ లేదా టెక్ట్స్ సమయంలో అవతలి వ్యక్తి అక్కడి పరిస్థితిని వివరించాలని కోరినప్పుడు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని తెలిపింది. ఆ సందర్భంలో సింగిల్ ట్యాప్‌తో లైవ్ వీడియోను స్ట్రీమ్ చేయొచ్చని, యూజర్ నచ్చినంతసేపు టెలికాస్ట్ చేయొచ్చని గూగుల్ తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో కొన్నిసార్లు పరిస్థితిని వివరించడం కష్టంగా ఉంటుందని, దీన్ని దృష్టిలోపెట్టుకొనే ఎమర్జెన్సీ లైవ్ వీడియో ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు గూగుల్ ప్రెసిడెంట్ (ఆండ్రాయిడ్ ఎకోసిస్టమ్) సమీర్ సమత్ తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో జీపీఎస్, సెల్, వైఫై, ఇతర సెన్సార్ల సాయంతో కచ్చితమైన లొకేషన్‌ను ఎమర్జెన్సీ సేవల విభాగానికి ఈ సదుపాయం అందిస్తుందని వెల్లడించారు. ప్రస్తుతానికి అమెరికా, జర్మనీ, మెక్సికో దేశాల్లో ఈ సేవలు ప్రారంభిస్తున్నామని, త్వరలో ఇతర దేశాలకూ విస్తరిస్తామని పేర్కొంది.