ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ హైదరాబాద్ పర్యటన పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమమని, దీనితో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి
మెస్సీ ఈవెంట్‌కు, ప్రభుత్వానికి సంబంధం లేదు
ఓ ప్రైవేట్ సంస్థే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది
మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి
న్యూఢిల్లీ: ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ హైదరాబాద్ పర్యటన పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమమని, దీనితో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి వస్తున్న సందర్భంగా గురువారం ఆయన పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. మెస్సీ పర్యటనను ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తోందని, ప్రభుత్వం అవసరమైన సహకారం మాత్రమే అందిస్తోందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడు నగరానికి వస్తున్నందున, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని రేవంత్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమానికి తాను కూడా ఒక అతిథిగా మాత్రమే హాజరవుతున్నానని చెప్పారు. ఈ ఈవెంట్‌కు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు ఆయన వెల్లడించారు. ఢిల్లీలో కలిసిన ప్రముఖులను కూడా ఈ కార్యక్రమానికి రావాలని కోరినట్లు తెలిపారు. కాగా, మెస్సీ గోట్ ఇండియా టూర్‌లో భాగంగా ఈ నెల 13న మెస్సీ హైదరాబాద్ రానున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో పాల్గొంటారు. ఈ మ్యాచ్‌లో మెస్సీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, పలువురు అంతర్జాతీయ క్రీడాకారులు రెండు జట్లుగా విడిపోయి ఆడనున్నారు. మెస్సీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సహా పలువురు స్టేడియంలో ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఇప్పుడేమో ఇది ప్రైవేట్ కార్యక్రమం అని సీఎం చెప్పడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.