మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు సమాచారం.
కొండా సురేఖ
హాజరు కావాలని మాత్రమే కోర్టు చెప్పింది
నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది: సురేఖ
నాంపల్లి/హైదరాబాద్, డిసెంబర్ 11 (ఈవార్తలు): మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు సమాచారం. ఇటీవల కొండా సురేఖ, ఫోన్ ట్యాపింగ్ కేసు, డ్రగ్స్ వ్యవహారం, నటి సమంత విడాకుల వివాదం వంటి సున్నితమైన అంశాలలో కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్నే లేపాయి. తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ కేటీఆర్ ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించారు. కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన కోర్టు బీఎన్‌ఎస్ సెక్షన్ 356 కింద పరిగణనలోకి తీసుకుని కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని హైదరాబాద్ పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలోనే తాజాగా ఆమెపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు తెలిసింది. అయితే, ఈ అంశంపై మంత్రి కొండా సురేఖ కార్యాలయం స్పందించింది. కొన్ని పత్రికలు, ఛానళ్లలో మంత్రి కొండా సురేఖపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసినట్టు వార్తలో నిజం లేదన్నారు. అయితే ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 5వ తేదీన ఉందని, కొండా సురేఖను కోర్టుకు తప్పనిసరిగా హాజరుకావాలని న్యాయస్థానం స్పష్టం చేసిందన్నారు.
నాపై తప్పుడు ప్రచారం: కొండా సురేఖ
తనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందన్న కథనాలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సీరియస్ అయ్యారు. తనకు ఎలాంటి వారెంట్ జారీ కాలేదని.. కోర్టుకు హాజరు కావాలని మాత్రమే కబురు అందిందని స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారామె. ‘కోర్టు నాకు ఎన్‌బీడబ్ల్యూ జారీ చేయలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న కోర్టుకు రావాలని చెప్పింది. నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది’ అని క్లారిటీ ఇచ్చారు.