కవిత రాక్షసి
కవిత
కేసీఆర్ కడుపున పుట్టడం బాధాకరం
బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసేలా వ్యాఖ్యలు
రేవంత్‌తో వ్యాపారాల కోసం కవిత విమర్శలు
సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి, నవంబర్ 16 (ఈవార్తలు): కారణజన్ముడైన కేసీఆర్ కడుపులో రాక్షసి పుట్టిందని కల్వకుంట్ల కవితపై సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు గురించి మాట్లాడకపోతే కవితకు పొద్దు గడవడం లేదని ఫైర్ అయ్యారు. ఆదివారం సంగారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ మంత్రి హరీశ్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా కవిత మాట్లాడిన తీరు సరికాదని, ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు ఇబ్బంది పడ్డారన్నారు. పార్టీని ఉద్దేశించి మాట్లాడకపోవడం మంచిదని, ఎవరిని సంతోష పెట్టడానికి అలా మాట్లాడుతుందో అర్థం కావడం లేదన్నారు. మెదక్ లో ఏడు స్థానాలు గెలిపించుకుని హరీష్ రావు జిల్లాప్రజల గుండెల్లో ఉన్నారనీ, జైలుకు వెళ్లడం, ఎంపీగా గెలవకపోవడం కవిత కర్మ కాదా అని మండిపడ్డారు. ఆమె ఎవరు వదిలిన బాణమో ప్రజలకు తెలుస్తుందని, ఇప్పటికైనా హరీశ్‌రావును విమర్శించేలా మాట్లాడడం మానుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ మాట్లాడుతుందని హెచ్చరించారు. కవిత వెంటనే పార్టీకి క్షమాపణ కోరాలని, అడుగు వేస్తే పార్టీకి నష్టం వాటిల్లే విధంగా ఉండి, కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటుందన్నారు. రేవంత్‌తో వ్యాపారాల కోసం ఇలా చేస్తుందని అందుకే లేనిపోని విమర్శలు గుప్పించే పని పెట్టుకున్నారని ఆరోపించారు. సమావేశంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, జిల్లా నాయకులు జైపాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, నాయకులు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.