దక్షిణాదిపై బీసీసీఐ వివక్ష

భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) గ్రౌండ్ కేటాయింపు విధానాలు ఎప్పుడూ వివాదాస్పదమే. ఇటీవలి కాలంలో, ముఖ్యంగా 2025-26 సీజన్‌లో, ఈ వివక్ష మరింత స్పష్టంగా కనిపిస్తోంది.

bcci allocation

ప్రతీకాత్మక చిత్రం

భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) గ్రౌండ్ కేటాయింపు విధానాలు ఎప్పుడూ వివాదాస్పదమే. ఇటీవలి కాలంలో, ముఖ్యంగా 2025-26 సీజన్‌లో, ఈ వివక్ష మరింత స్పష్టంగా కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలు - తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ తదితర రాష్ట్రాలు క్రికెట్ చరిత్రలో ముఖ్యమైన స్థానం కలిగి ఉన్నప్పటికీ, బీసీసీఐ వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వైపు మొగ్గు చూపుతోంది. ఇది కేవలం యాదృచ్ఛికమా? లేదా రాజకీయ ప్రభావాలు, వ్యక్తిగత లాభాలు కలిసిన ఒక ఆటా? 1928లో ప్రారంభమైన బీసీసీఐ.. భారత క్రికెట్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. కానీ ఇటీవలి దశాబ్దాల్లో, ముఖ్యంగా జయ్ షా బీసీసీఐ సెక్రటరీగా, తర్వాత ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత, గుజరాత్ రాష్ట్రానికి, ముఖ్యంగా అహ్మదాబాద్‌ కోసమే క్రికెట్ అన్నట్లు  కనిపిస్తోంది. జయ్ షా, కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా కుమారుడు కావడం వల్ల, రాజకీయ ప్రభావాలు ఇక్కడ పాత్ర పోషిస్తున్నాయన్నది కాదనలేని వాస్తవం. 2023లో వరల్డ్ కప్ ఫైనల్ అహ్మదాబాద్‌లో జరగడం, 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కూడా అక్కడే నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించడం - ఇవన్నీ ఈ వివక్షకు ఉదాహరణలు. దక్షిణాది రాష్ట్రాలు క్రికెట్‌కు ఎంతో సేవ చేశాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియం, బెంగళూరు చిన్నస్వామి స్టేడియం, హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియం - ఇవి భారత క్రికెట్ చరిత్రలో ఐకానిక్ వేదికలు. రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, అశ్విన్, అజారుద్దీన్, కృష్ణమాచారి శ్రీకాంత్ వంటి లెజెండ్స్ ఇక్కడి నుంచే వచ్చారు. కానీ 2025-26 సీజన్ షెడ్యూల్ చూస్తే, దక్షిణాది రాష్ట్రాలకు బీసీసీఐ మొండి చెయ్యి చూపుతోందని అర్థం అవుతోంది. ఉదాహరణకు, వెస్టిండీస్ టూర్ ఆఫ్ ఇండియాలో మొదటి టెస్ట్ అహ్మదాబాద్‌లోనే, సౌతాఫ్రికా టూర్‌లో 5వ టీ20 అహ్మదాబాద్‌లోనే, ఇక సౌతాఫ్రికా ఏ టీమ్ టూర్‌లో మూడు వన్డేలు రాజ్‌కోట్‌లో (గుజరాత్). మొత్తం గుజరాత్‌కు 5 మ్యాచ్‌లు కేటాయించగా, దక్షిణాదికి 3 మాత్రమే కేటాయించారు. అహ్మదాబాద్‌కే మ్యాచ్‌ల కేటాయింపు ఎందుకు? అంటే.. నరేంద్ర మోదీ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం (1.32 లక్షల సీటింగ్ కెపాసిటీ) కావడం ఒక కారణం. కానీ ఇది కేవలం సాంకేతిక కారణమా? లేదు. రాజకీయ ఫేవరిటిజం ఇక్కడ కీలకం. జయ్ షా గుజరాత్ నుంచి వచ్చినవాడు కావడం, బీజేపీతో అతని సంబంధాలు - ఇవి అహ్మదాబాద్‌ను 'క్రికెట్ క్యాపిటల్'గా మార్చుతున్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్‌లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్, ఫైనల్ అహ్మదాబాద్‌లో జరగడం విమర్శలకు దారితీసింది. ఇప్పుడు 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కూడా అక్కడే - ఇది 'పాలిటిక్స్ అండ్ ఫేవరిటిజం' అని శివసేన నాయకుడు ఆదిత్య థాకరే బాహాటంగానే విమర్శించారు.

దక్షిణాదికి ఆర్థిక నష్టాలు

దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష కారణంగా క్రికెట్ మ్యాచ్‌లు కేటాయింపు జరగడం లేదు. దాంతో.. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయి. క్రికెట్ మ్యాచ్‌లు స్థానిక ఆర్థిక వ్యవస్థను బూస్ట్ చేస్తాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రాన్స్‌పోర్ట్, టూరిజం.. ఇలా అన్నీ ప్రభావితం అవుతాయి. అహ్మదాబాద్‌కు అన్ని బిగ్ మ్యాచ్‌లు వెళ్తుంటే, చెన్నై, బెంగళూరు లాంటి నగరాలు ఈ లాభాలను కోల్పోతున్నాయి. బీసీసీఐ ఈ వేదికలను నిర్లక్ష్యం చేయడం వల్ల, దక్షిణాది అభిమానులూ అలసిపోతున్నారు. ఇది క్రికెట్‌ను 'నార్త్ వర్సెస్ సౌత్' డివైడ్‌గా మారుస్తోంది. దేశీయ ఐక్యతకు హాని కలిగిస్తుంది. అటు.. ముంబై, కోల్‌కతా లాంటి సంప్రదాయ వేదికలు కూడా నిర్లక్ష్యమవుతున్నాయి. వాటితో పోల్చితే దక్షిణాది పరిస్థితి మరీ దారుణం. బీసీసీఐ రొటేషన్ పాలసీని అమలు చేయాలి. అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు ఇవ్వాలి. దీనికోసం దక్షిణాది అసోసియేషన్లు ఐక్యమై గళం విప్పాలి. రాజకీయ ప్రభావాలను తొలగించి, క్రికెట్‌ను ప్యూర్ స్పోర్ట్‌గా ఉంచాలి. లేకపోతే, భారత క్రికెట్ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఇది కేవలం వివక్ష కాదు, దేశీయ అసమానతలను పెంచే చర్య. బీసీసీఐ ఈ మార్గాన్ని మార్చకపోతే, దక్షిణాది అభిమానులు బాయ్‌కాట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది.

- హనుమంతు వీరదేవర, క్రికెట్ విశ్లేషకుడు


విభూది వస్త్రం.. త్రిశూలమే అస్త్రం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్