పార్టీ రిజర్వేషన్లు ఎవడిక్కావాలి?
ప్రతీకాత్మక చిత్రం
రాజ్యాంగబద్ధంగా 42 శాతం మా హక్కు
హైదరాబాద్ న్యాయసాధన దీక్షలో ఆర్ కృష్ణయ్య
ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్‌లో దీక్ష
ఇందిరాపార్క్/హైదరాబాద్, నవంబర్ 16 (ఈవార్తలు): పార్టీపరంగా ఇచ్చే రిజర్వేషన్లు తమకు అవసరం లేదని, రాజ్యాంగబద్ధంగా వచ్చే రిజర్వేషన్లే బీసీలకు కావాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నాచౌక్ ఆయన నేతృత్వంలో ఆదివారం జరిగిన ‘బీసీ రిజర్వేషన్ల న్యాయ సాధన దీక్ష’కు బీసీ సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీ కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం తక్కువగా ఉందని చెప్పారు. ప్రభుత్వం కచ్చితమైన జనాభా లెక్కలు సమర్పిస్తే 42 శాతం రిజర్వేషన్ న్యాయపరంగా సాధ్యమేనని తెలిపారు. కోర్టులు కూడా సమగ్ర డేటా ఆధారంగా రిజర్వేషన్ పెంపును పరిశీలిస్తాయని అన్నారు. దీక్షకు అధ్యక్షత వహించిన బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రామాణిక పద్ధతులు పాటిస్తే 42 శాతం మాత్రమే కాదు, 52 శాతం రిజర్వేషన్లు కూడా అమలుచేయొచ్చని పేర్కొన్నారు. ‘డేటా బలంగా ఉంటే చట్టపరమైన అవరోధాలు తగ్గుతాయి’ అని వెల్లడించారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్ పెంపును అమలుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. దీక్ష సమయంలో ఇందిరా పార్క్ బీసీ రిజర్వేషన్ల నినాదాలతో మార్మోగింది. వేల మంది బీసీ సంఘాల కార్యకర్తలు తరలిరావటంతో ధర్నా ప్రాంగణం కిక్కిరిసింది. బీసీల జనాభా, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతిష్టాత్మక వేదికల్లో తగిన శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్‌ను నేతలు పునరుద్ఘాటించారు. ఈ దీక్షలో విద్యార్థి, యువజన, మహిళ, ఉద్యోగ, న్యాయవాదులు సహా 60కిపైగా బీసీ సంఘాలు పాల్గొన్నాయి.