చలి తీవ్రతకు తెలంగాణ పల్లెలు వణుకుతున్నాయి. ఈ చలికి రక్తం కూడా గడ్డ కడుతుందేమోనన్నంత భయం వేస్తోంది. పట్నం, పల్లె అనే తేడా లేకుండా చలి పంజా విసురుతోంది.
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణను వణికిస్తున్న చలి
రెండ్రోజులు తీవ్ర ఈదురు గాలులు
ఎల్లో హెచ్చరికలు జారీ
హైదరాబాద్, డిసెంబర్ 11 (ఈవార్తలు): చలి తీవ్రతకు తెలంగాణ పల్లెలు వణుకుతున్నాయి. ఈ చలికి రక్తం కూడా గడ్డ కడుతుందేమోనన్నంత భయం వేస్తోంది. పట్నం, పల్లె అనే తేడా లేకుండా చలి పంజా విసురుతోంది. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం పొగమంచు పరిస్థితులు ఉంటే, సాయంత్రం 5 దాటితే ఇంట్లో నుంచి బయటికి రావటానికి జంకుతున్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం.. రాబోయే 2-3 రోజులు సాధారణం కంటే 3 డిగ్రీల నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. 13న ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలి గాలులు వీచే సూచనలున్నాయి. 14 నుంచి పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.