|| ప్రతీకాత్మక చిత్రం ||
ఈవార్తలు, ఆధ్యాత్మికం : కొత్త ఆంగ్ల సంవత్సరంలోకి అడుగు పెట్టాక మొదటగా వచ్చే పండుగే సంక్రాంతి. ఇది రైతుల పండుగ. వరి పంట చేతికి అందిన తర్వాత ఈ పండుగ వస్తుంది. దేశ, విదేశాల్లో ఉండే వాళ్ల కూడా సంక్రాంతికి పల్లెల్లోకి వెళ్లేందుకు ఆరాట పడుతుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 13, 14, 15 తేదీల్లో గానీ, 14, 15, 16 తేదీల్లో గానీ జరుపుకొనే ఈ పండుగకు ఖగోళ శాస్త్రం ప్రకారం ఓ ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు దక్షిణార్ధ గోళం నుంచి ఉత్తరార్ధ గోళం వైపునకు అంటే.. మకర రాశివైపునకు మారుతాడు అనేదానికి ఈ పండుగ సూచన. ఈ పండుగను మకర సంక్రాంతి అనేది అందుకే. అయితే, భోగి అంటే ఏంటి? సంక్రాంతి అంటే? భోగి పళ్లు ఎందుకు పోసుకుంటారు? ముగ్గుల విశిష్టత ఏంటి? హరిదాసుల విశిష్టత ఏమిటి? కనుమ రోజు ఏం చేయాలి? గాలి పటాలు ఎందుకు ఎగురవేయాలి? అన్న విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
భోగి మంటలు: మన ఇంట్లో ఉన్న పాత వస్తువులను ఒక చోట పేర్చి భోగి మంటలు వేస్తారు. అంటే దాని అర్థం మనలో ఉన్న పాత ఆలోచనలు వదిలేసి కొత్త ఆలోచనలతో జీవితం సాగించాలి అని అర్థం. భోగి అంటే భోగ భాగ్యాలతో, సుఖ సంతోషాలతో, కొత్త ఆలోచనలతో జీవితంలోకి అడుగు పెట్టామని అర్థం.
భోగి పళ్లు: భోగి రోజు సాయంత్రం చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో పెద్దలు ఆశీర్వదిస్తూ భోగి పళ్లు పోస్తారు. భోగి పళ్లు అంటే రేగు పండ్లు అని అర్థం. రేగు పండ్లు సూర్యుని ఆకారంలో ఉంటాయి కాబట్టి, సూర్య అనుగ్రహం పిల్లలకు కలిగి ఆరోగ్యంగా, దిష్టి తగలకుండా సంతోషంగా ఉంటారని భోగి పళ్లు పోస్తారు.
మకర సంక్రాంతి: మనకి మొత్తం 12 రాశులు ఉంటాయి. సూర్యుడు నెలకొక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఏ రోజైతే మకర రాశిలోకి ప్రవేశిస్తాడో ఆ రోజును మకర సంక్రాంతిగా పిలుస్తారు. మకర సంక్రాంతికి అర్థం ఏమిటంటే.. సం-మిక్కిలి, క్రాంతి-అభ్యుదయం మంచి అభ్యుదయం ఇచ్చు క్రాంతి కనుక సంక్రాంతి అంటాం.
ముగ్గుల విశిష్టత: ముగ్గు వేసే ముందు వాకిలిని శుభ్రం చేసుకుంటాం. తర్వాత కల్లాపి చల్లుతాం, ఆ తరువాత ముగ్గు పెడతాం. ముగ్గు ఎలాగైతే ఒక పద్ధతిలో వేస్తామో, అలాగే మన ఆలోచనలు కూడా ఒక పద్ధతిలో ముందుకు నడవాలని ముగ్గు మనకు సందేశం ఇస్తుంది.
గొబ్బెమ్మల విశిష్టత: గొబ్బెమ్మలు గోదాదేవికి సంకేతం. గొబ్బెమ్మ అంటే గోపి+బొమ్మ అని అర్థం. గోపి అంటే కృష్ణుడు, బొమ్మ అంటే గోపికలు. కృష్ణుడి ఆశీస్సులు ఎప్పుడూ మన మీద ఉండాలని ఆశిస్తూ ముగ్గుపై గొబ్బెమ్మలతో అలంకరిస్తారు.
హరిదాసుల విశిష్టత: హరిదాసు అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు అని అర్థం. హరిదాసులు హరినామ కీర్తన ఎందుకు చేస్తారంటే తను ఏ భోగభాగ్యాలకు లొంగను, కేవలం హరినామ సంకీర్తనలకే వచ్చేవాడినని తనకు తమ పరభేదాలు లేవని అందుకే ప్రతి ఇంటికి తిరుగుతూ వస్తాడని సంకేతం.
సంక్రాంతి రోజు చేయవలసిన పనులు:
- బూడిద గుమ్మడికాయ దానం చేయడం చాలా మంచిది.
- పితృతర్పణాలు ఇవ్వడం మంచిది.
- పాలు, పొంగలి, పాయసం లేదా ఏదైనా స్వీట్ చేయడం మంచిది.
- కొందరు గోదాదేవి నోము లేదా గొబ్బి గౌరీ వ్రతం చేసుకుంటారు.
కనుమ విశిష్టత: కనుమను పశువుల పండగ అని కూడా అంటారు. కనుమ రోజు ప్రతి ఇంటి ముందు రథం ముగ్గు తప్పకుండా వేస్తారు.
రథం ముగ్గు విశిష్టత: మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని ఇచ్చే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే ఈ రథం ముగ్గు. అందరూ ఒకరికొకరు తోడుంటే కలిసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఒక రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతారు.
గాలిపటం విశిష్టత: ఎన్ని అడ్డంకులు వచ్చినా మన జీవితం అలాగే మన ఆశయం కూడా ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని గాలిపటం సూచిస్తుంది.