Moonlighting : ఒక కంపెనీలో పనిచేస్తూ ఇంకో కంపెనీలో పనిచేయొద్దా.. అసలేంటీ మూన్ లైటింగ్.. భారత చట్టం ఏం చెప్తోంది?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

(ప్రతీకాత్మక చిత్రం)

ఈవార్తలు, వైరల్ న్యూస్: ప్రస్తుతం ఐటీ కంపెనీలన్నీ కోడై కూస్తున్న మాట.. మూన్‌లైటింగ్. ఉద్యోగులెవరూ మూన్‌లైటింగ్‌కు పాల్పడవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నాయి. అసలేంటీ మూన్‌లైటింగ్? అంటే.. ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ మిగిలిన సమయంలో మరో కంపెనీలో ఉద్యోగం చేయడాన్నే మూన్‌లైటింగ్ అంటారు. ఒక మాటలో చెప్పాలంటే సైడ్ జాబ్ (Side Job) అనొచ్చు. ఉదాహరణకు ఒక ఉద్యోగి ఒక కంపెనీలో 8 గంటల డ్యూటీ చేయాలి. ఆ వ్యక్తి ఒక కంపెనీలో 8 గంటల డ్యూటీ చేయడమే కాకుండా, అదనంగా డబ్బు సంపాదించేందుకు మిగిలిన సమయంలో, వీకెండ్స్‌లో వేరే కంపెనీలో ఉద్యోగం చేస్తే దాన్ని మూన్‌లైటింగ్ అంటారు. మూన్‌లైటింగ్ వల్ల ఉద్యోగి నుంచి వచ్చే ఉత్పాదకత తగ్గిపోతోందని ఐటీ కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి. అందుకే ఇన్ఫోసిస్ (Infosys), విప్రో (Wipro), ఐబీఎం (IBM) కంపెనీలు ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశాయి. మూన్‌లైటింగ్‌కు పాల్పడితే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఆదేశాలు జారీ చేశాయి. ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు తమ కంపెనీకి మాత్రమే పని చేస్తామన్న ఒప్పందంపై సంతకాలు చేశారని, దాన్ని అతిక్రమిస్తే చీటింగ్ చేసినట్లేనని, అందుకు చర్యలు తప్పవని స్పష్టం చేశాయి.

ఎప్పుడు వెలుగులోకి వచ్చింది?

ఎప్పటినుంచో ఈ పద్ధతి ఉన్నా, కరోనా వల్ల వర్క్ ఫ్రం హోమ్ అందుబాటులోకి రావడంతో మూన్‌లైటింగ్ వెలుగులోకి వచ్చింది. ఐటీ రంగంలో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. కొన్ని రోజుల కిందట ఓ వ్యక్తి ఒకే సారి ఏడు ఉద్యోగాలు చేస్తున్నట్లు పీఎఫ్ ఖాతాల ద్వారా గుర్తించారు. అప్పటి నుంచి దీనిపై ఎక్కువగా చర్చ జరుగుతోంది.

విశ్లేషకులు ఏమంటున్నారు?

మూన్‌లైటింగ్ చీటింగ్ చేయడమేనని విప్రో చైర్మన్ ప్రేమ్‌జీ పేర్కొన్నారు. అయితే, ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్‌దాస్ దీనిపై మరోవిధంగా వ్యాఖ్యానించారు. ఉద్యోగం అనేది ఎంప్లాయర్-ఎంప్లాయి మధ్య రోజులో కొన్ని గంటల కాంట్రాక్టు మాత్రమేనని పేర్కొన్నారు.

వ్యక్తి జీవితంపై కంపెనీల అజమాయిషీ ఏంటి?

ఒక వ్యక్తి రోజులో 8 గంటల డ్యూటీ చేయాలనేది కంపెనీతో కూదుర్చుకొనే ఒప్పందం. కానీ, అతడు మరో పని చేయొద్దు అనడానికి కంపెనీలకు అధికారం ఎక్కడిది? అని పలువురు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు కంపెనీలు ఏ ఒక్క రోజు కూడా 8 గంటల కంటే ఎక్కువ సేపు డ్యూటీ చేయించుకోకూడదని స్పష్టం చేస్తున్నారు. ఎక్స్‌ ట్రా డ్యూటీ చేస్తే అదనంగా డబ్బు కట్టిస్తున్న కంపెనీలు చాలానే ఉన్నాయి. కాబట్టి ఏ కంపెనీ కూడా అలా చేయొద్దు కదా మరి అని అడుగుతున్నారు. వాస్తవానికి వర్క్ ఫ్రం హోమ్ అందుబాటులోకి వచ్చాక చాలా కంపెనీలు ఆఫీస్ వేళలకు మించి ఉద్యోగులతో పని చేయిస్తున్నాయి. మరి ఇది కూడా అనైతికమే కదా అని నిలదీస్తున్నారు. ఒక వ్యక్తికి సామర్థ్యం ఉండి, కష్టపడే తత్వం ఉండి, కుటుంబాన్ని గొప్పగా పోషించుకోవాలన్న కోరికతో రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతారు. శక్తికి మించి పనిచేసి డబ్బు కూడబెట్టుకుంటారు. ఒక ఉద్యోగి తానిచ్చే జీతానికే పనిచేయాలి, తనకోసమే పనిచేయాలని హుకుం జారీ చేయడం కూడా నైతికంగా తప్పేనని పేర్కొంటున్నారు.

భారత్‌లో చట్టం ఎలా ఉంది?

షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం, ఫ్యాక్టరీల చట్టంలోని సెక్షన్ 60 ప్రకారం.. ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయడం నిషేధం. అయితే, ఈ నిబంధన నుంచి ఐటీ సంస్థలకు మినహాయింపు ఇచ్చారు.



సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్