తెలంగాణలో బీర్ల ధరలు పెరగనున్నాయా? పెంచే ధరలు త్వరలోనే అమల్లోకి రానున్నాయా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణలో బీర్ల ధరలు పెరగనున్నాయా? పెంచే ధరలు త్వరలోనే అమల్లోకి రానున్నాయా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. గురువారం హైదరాబాద్‌లోని ఆబ్కారీ భవన్‌లో రాష్ట్ర ఎక్సైజ్ కమిటీ సమావేశమై దీని గురించే చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను అమలు చేయాలంటే డబ్బు కావాలి. అందుకోసం మద్యం ద్వారా కొంత సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే బీర్ల ధరలు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దాదాపు 15-20 శాతం ధరలు పెంచేందుకు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు ఎక్సైజ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ధరల పెంపు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే కొత్త ధరలను వినాయక నిమజ్జనం రోజు నుంచే అమల్లోకి తెస్తారని సమాచారం. అయితే, ఇప్పటికి బీర్ల ధరలు మాత్రమే పెరగనున్నట్లు తెలిసింది. విస్కీ సహా ఇతర మద్యం ధరలు ప్రస్తుతం ఉన్న రేటులోనే దొరకనున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఉత్పత్తి నుంచి వినియోగదారుడి దాకా బీర్ల రేట్లు ఇలా..
రాష్ట్రంలో మొత్తం 6 బ్రూవరీలు ఉన్నాయి. అందులో ఏడాదికి 88 కోట్ల లీటర్ల బీరు ఉత్పత్తి అవుతోంది. ఈ బీరును తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కొనుగోలు చేసి మద్యం దుకాణాలకు సరఫరా చేస్తుంది.
బ్రూవరీలకు బేవరేజెస్ కార్పొరేషన్ ఇచ్చే రేటు.. 12 బీర్లు ఉండే ఒక కేసు (లైట్ బీర్లు) - రూ.289, స్ట్రాంగ్ బీర్లకు రూ.313
అంటే.. బ్రూవరీలకు ఒక్కో బీరుకు చెల్లించే ధర రూ.24
కార్పొరేషన్ నుంచి మద్యం దుకాణాలకు ఇచ్చే రేటు రూ.1,400 (ఒక కేసుకు)
మద్యం దుకాణాల నుంచి వినియోగదారుడికి అమ్మే రేటు రూ.1,800 (ఒక కేసుకు)
అంటే.. రూ.24 బీరు వినియోగదారుడికి చేరే సరికి రూ.150 అవుతోంది.