SGB | బంగారం కొనాలనుకుంటున్నారా.. కేంద్రం తెచ్చిన ఈ స్కీమ్ మీ కోసమే

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

ఈవార్తలు, బిజినెస్ న్యూస్: 2023-24లో సావరీన్ గోల్డ్ బాండ్ (Sovereign Gold Bond)  స్కీమ్  తొలి విడత సబ్‌స్క్రిప్షన్ తేదీ ఖరారైంది. ఈ నెల 19వ తేదీ నుంచి ఈ స్కీమ్ అందుబాటులో ఉండనుంది. ఒక్కో గ్రాముకు రూ.5,926 చొప్పున ధరను నిర్ణయించారు. ఈ స్కీమ్ ఈ నెల 27వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. కేంద్రం తరఫున భారతీయ రిజర్వు బ్యాంక్ (RBI) ఈ బాండ్లను జారీ చేయనుంది. బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో అమ్ముతారు. ఆన్‌లైన్‌లో కొనేవారికి గ్రాముపై రూ.50 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే.. రూ.5,876కు గ్రాము దొరుకుతుంది.

ఏమిటీ సావరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్?

బంగారం కొనుగోళ్లను తగ్గించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. సబ్‌స్క్రిప్షన్ ముందు వారం చివర్లో 999 స్వచ్ఛత కలిగిన బంగారానికి ఇండియా బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ లిమిటెడ్ నిర్ణయించిన ధర ఆధారంగా గ్రాము రేటును నిర్ణయిస్తారు. కొనుగోలు చేయాల్సినవాళ్లు కనీసం ఒక గ్రామును కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ బాండ్ వయోపరిమితి ఎనిమిదేళ్లు. గడువు ముగిశాక అప్పటి ధరను చెల్లిస్తారు. ఐదేళ్ల తర్వాత కావాలంటే బాండ్‌ను అమ్ముకోవచ్చు. బయట కొనే బంగారానికి వర్తించే కేవైసీ నిబంధనలే వర్తిస్తాయి.

ఎవరెవరు ఎంతెంత కొనొచ్చు?

- ఒక ఏడాదిలో వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబాలు గరిష్ఠంగా 4 కిలోల వరకు కొనొచ్చు.

- ట్రస్టులు 20 కిలోల వరకు కొనుగోలు చేయొచ్చు.

వెబ్ స్టోరీస్