||ప్రతీకాత్మక చిత్రం|| హైదరాబాద్‌లో సంక్రాంతి పండుగ హడావిడి మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకునే ఈ పండుగ కోసం దాదాపు 12 లక్షల పైగా ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పండుగతోపాటు శని, ఆదివారాలు రావడంతో ప్రజలు ముందుగానే పయనమవ్వడానికి సిద్ధమవుతున్నారు. సంక్రాంతి సందర్భంగా ఇప్పటికే టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. తెలంగాణ ఆర్టీసీ 4,233 ప్రత్యేక బస్సులను సంక్రాంతి పండుగ సందర్భంగా కేటాయించింది. ముందస్తు టికెట్లు బుకింగ్ చేసుకునే వారికి రాయితీలు కూడా ప్రకటించింది. ఏపీ ఆర్టీసీ మరో 1850 బస్సులను ఏర్పాటు చేసింది. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో సాధారణ చార్జీలనే తీసుకోగా, ప్రైవేట్ బస్సులు పండుగ సందర్భంగా రెండు, మూడింతల ఛార్జీలను వసూలు చేస్తున్నాట్లు ప్రయాణికులు తెలిపారు. పిల్లలకు 13 నుంచి సెలవులు కావడంతో కుటుంబ సభ్యులతో 11, 12 తేదీల నుంచే సొంతూళ్లకు పయనం అవుతారని బస్సులు, రైళ్లు రద్దీ పెరగనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే ఆదివారం నుండే తమ సొంతూళ్లకు వెళ్లేందుకు పయనం అయ్యారని మంగళ, బుధవారాల్లో ఇంకా ఎక్కువగా వెళ్లేందుకు సిద్ధమవుతారని ఆర్టీసీ అధికారులు అధిక బస్సులను ఏర్పాటు చేశారు. అయితే ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రైవేటు బస్సులకు చాలా డిమాండ్ పెరిగిపోయింది. సాధారణ రోజుల కంటే మూడింతలు ఎక్కువగా వసూలు చేస్తున్నారు అంటే 600 నుంచి 800 ఉన్న టికెట్ ధర ఇప్పుడు రెండు నుంచి మూడు వేల వరకు పెంచారు. తమ సొంతూళ్లలోనే పండగను జరుపుకోవాలనే నేపథ్యంలో ప్రజలు ఎక్కువ టికెట్ ధరను చెల్లించైనా వెళ్తున్నారు. అయితే టీఎస్ ఆర్టీసీ లో ప్రయాణించే ప్రజలకు ఆర్టీసీ శుభవార్త తెలిపింది అదేమిటంటే ఆర్టీసీలో వెళ్లే ప్రజలు టోల్‌ప్లాజాల వద్ద ఎక్కువ సమయం అక్కడే నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేకమైన లైనును ఏర్పాటు చేసినట్లు టీఎస్ ఆర్టీసి తెలిపింది.