(వైఎస్ జగన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్, చంద్రబాబు)
ఈవార్తలు, ఏపీ వార్తలు: ప్రజా సంక్షేమమే ముందు.. ఇంకేదైనా తర్వాతే అన్న వైఎస్సాఆర్ సిద్ధాంతంతోనే ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ జగన్ పాలన కొనసాగిస్తున్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర ప్రతిష్ఠాత్మక పథకాల స్ఫూర్తితో జగన్ నవరత్నాలను అమలు చేస్తున్నారు. చంద్రబాబు నుంచి అధికారం దక్కించుకొన్నప్పటి నుంచి తనదైన శైలిలో పాలన సాగిస్తూ ముందుకు పోతున్నారు. కానీ, జగన్ తాజాగా తీసుకొన్న ఒక్క నిర్ణయం ఆయన పాలనపై పెద్ద మచ్చే పడే ప్రమాదం పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి.. తన రాజకీయ చతురత ఎంత గొప్పదో చూపిన జగనే.. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చటం పెద్ద దుమారానికి తెర తీసింది.
జగన్‌కు వచ్చే ప్రమాదమేంటి?
వైసీపీ గెలవటంలో జగన్ పాత్ర ఎంతుందో, చంద్రబాబు పాత్ర కూడా అంతే ఉంది. జగన్ పాదయాత్రతో ప్రజలకు దగ్గరయ్యారు. కుల రాజకీయాలతో చంద్రబాబు అదే ప్రజలకు దూరమయ్యారు. అయితే, ఇక్కడ ఎన్టీఆర్ అనే పేరు కులానికి అతీతం. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఎన్టీఆర్ పేరుకు కులం కార్డుగా వాడుకొన్నా, కోట్లాది ఆంధ్రుల గుండెల్లో ఆయనది ప్రత్యేక స్థానం. ఆయన ఒక ఆత్మగౌరవ ప్రతీక. ఆ ఆత్మగౌరవాన్ని జగన్ టచ్ చేశారని, అది వచ్చే ఎన్నికల్లో ప్రభావం భారీగానే చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్టీఆర్, వైఎస్సార్.. ఈ పేర్లలో వైబ్రేషన్
ఎన్టీఆర్.. యావత్తు దేశానికి సుపరిచితం. అధికార అహంకారంతో వ్యవహరించిన ఢిల్లీ పెద్దల చెంప చెల్లుమనిపించారు. వైఎస్సాఆర్.. దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటుచేసుకొన్న నాయకుడు. వీరిద్దరిని పోల్చి చూడడం పెద్ద తప్పే అవుతుంది. కానీ, హెల్త్ యూనివర్సిటీ విషయానికి వచ్చేసరికి ఎన్టీఆర్ పేరును తొలగించడం జగన్ చేసిన పెద్ద తప్పే. ఎన్టీఆర్ అనే పేరును ఆత్మగౌరవంగా భావించే కోట్లాది తెలుగు ప్రజల గుండెల్లో ముల్లు పెట్టి గుచ్చినట్టు అవుతోంది జగన్ నిర్ణయం.
రూపాయి తక్కువిచ్చినా పట్టించుకోరు కానీ, ఆత్మగౌరవం దెబ్బతింటే..
తెలుగు వాళ్లకు ఆత్మగౌరవం ఎక్కువ. ప్రజాసంక్షేమంలో దూసుకుపోతున్న జగన్.. ఒక రూపాయి తక్కువిచ్చినా ప్రజలు పట్టించుకోరు. కానీ, ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే హర్ట్ అవుతారు. తెలంగాణలో ఈటల రాజేందర్ విషయంలో జరిగిందిదే. ఉద్యమంలో పాల్గొన్న ఈటల రాజేందర్‌ను కేసీఆర్ అవమానించి బయటకు పంపారని, ఆత్మగౌరవమే హుజూరాబాద్ ప్రజలకు ఈటలను మరింత దగ్గర చేసిందని అంటుంటారు. సేమ్ టు సేమ్.. ఇక్కడ జగన్‌కు కూడా వర్తిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. రాజకీయాలు చేస్తే.. రాజకీయ చాణక్యుడు అంటాడు. కానీ, ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తే చరిత్రలో కొన్ని పేజీలను వదులుకోవాల్సి ఉంటుంది. ఆ తప్పు జగన్ చేశారు. ఇది నిజం. దాన్ని సరిదిద్దుకోవడానికి జగన్ కొత్త ప్రయత్నాలు చేయాల్సిందే, ప్రణాళికలు వేయాల్సిందే.