|| తడి, పొడి చెత్తపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ రాహుల్ ||
ఈవార్తలు, మంచిర్యాల: సమాజంలో ఎలా బతకాలి.. సమాజాన్ని ఎలా మార్చాలి.. సమాజాన్ని ఎలా జాగృతం చేయాలి.. మన చుట్టూ ఉన్న పరిసరాలను ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్న విషయాలు తెలిస్తే గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, దేశాభివృద్ధికి బాటలు వేయొచ్చు. అలాంటి సురక్షిత సమాజాన్ని నిర్మించే విధానాన్ని విద్యార్థి దశ నుంచి అలవాటు చేస్తే ముందు తరం గొప్పగా తయారవుతుంది. అందుకే విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దేందుకు మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ మరో బృహత్తర కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఎలా ఉంచుకోవాలి? అని చెప్పేలా తానే స్వయంగా వినూత్న నిర్ణయానికి నడుం కట్టారు. ‘‘విద్యార్థుల భాగస్వామ్యంతో ఇంటింటా తడి చెత్త - పొడి చెత్త విభజన’’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అంటే.. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసే పద్ధతులను నేర్పించడం అన్న మాట. అంతేకాదు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, ఉపన్యాస పోటీలు నిర్వహించి, వారిలో పోటీతత్వాన్ని పెంచేలా చేశారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు కూడా అందజేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ప్రార్థన తర్వాత చెత్త రకాలు, వాటి నిర్వహణపై వివరించడం, తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసేలా ప్రతిజ్ఞ చేయించడం, విద్యార్థుల ముందే తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేయడం వంటివి చేయించారు. ఈ వినూత్న నిర్ణయం పట్ల అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అడిషనల్ కలెక్టర్ రాహుల్ కొత్త ఆలోచన విద్యార్థులను సమాజ హితానికి పాటుపడేలా చేస్తుందని పలువురు కొనియాడుతున్నారు. ఇలాంటి గొప్ప ఆలోచనలు యువ కలెక్టర్‌కు రావటం శుభసూచకమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి మరిన్ని పర్యావరణ హిత కార్యక్రమాలను అమలు చేసి, బంగారు తెలంగాణను, పరిశుభ్ర తెలంగాణను నిర్మించాలని వెల్లడించారు.