మంచిర్యాల జిల్లాలో హాట్ టాపిక్‌గా ప్రతిభ ప్రోత్సాహక పరీక్ష.. అడిషనల్ కలెక్టర్ రాహుల్ చేపట్టిన మరో కార్యక్రమం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||పరీక్ష కేంద్రంలో మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ రాహుల్||

ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థుల ప్రతిభకు ఏం తక్కువ..?

వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఎందుకు చేయొద్దు..?

వారికి ఉన్నత ప్రమాణాలతో చదువు ఎందుకు అందించకూడదు..?

ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులతో పోటీ పడేలా ఎందుకు తీర్చిదిద్దకూడదు..?

సంప్రదాయ పరీక్ష విధానం కాదు.. పోటీ పరీక్ష విధానాన్ని అలవర్చాలి..!

ఇదే ప్రధాన ధ్యేయంతో మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ రాహుల్ మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఇప్పటికే.. విద్యార్థి దశ నుంచే తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానాన్ని తెలియజెప్పే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

అంతకుముందు.. పంచాయతీ సెక్రటరీలకు క్విజ్ నిర్వహించి వారు మరింత గొప్పగా పనిచేసేలా చేశారు.

ఆ మునుపు.. సర్కారు బడి టీచర్లను ప్రోత్సహించేలా తన స్వహస్తాలతో ప్రోత్సాహక లేఖలు రాశారు.

ఇక ఇప్పుడు.. ‘ప్రతిభ ప్రోత్సాహక పరీక్ష’ అంటూ విద్యార్థులను సానబెట్టే పనిని భుజానికెత్తుకున్నారు.

ఈవార్తలు, మంచిర్యాల : తెలంగాణ ప్రభుత్వం అందించే ఫలాలు విద్యార్థులకు అందాలన్నదే ఆయన ప్రధాన లక్ష్యం. వారిని ఉన్నత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పం ఆయనది.. లక్షలు పెట్టి చదువు కొనలేనివారిని ప్రోత్సహించి, వారికి మంచి దారి చూపించాలన్నదే ఆయన ధ్యేయం.. అందుకే విద్యార్థులే టార్గెట్‌గా వారికోసం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్. ఉన్నత ప్రమాణాలతో ఉత్తమ ఫలితాలను సాధించేలా, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే ధ్యేయంగా ‘ప్రతిభ ప్రోత్సాహక పరీక్ష’ను చేపట్టారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఈ నెల 11వ తేదీన ఈ పరీక్షను నిర్వహించారు.  సులభ, మధ్యస్థ, కఠిన ప్రశ్నలను 4:3:3 నిష్పత్తిలో ప్రశ్నపత్రాన్ని తీర్చిదిద్దారు. ఇక, విద్యార్థులు పరీక్ష ఎలా రాస్తున్నారో తెలుసుకొనేందుకు తానే స్వయంగా పరీక్ష కేంద్రాలను పరీక్ష నిర్వహణ తీరును పర్యవేక్షించారు.

ఈ పరీక్ష వెనుక మంచి ఉపాయం కనిపిస్తున్నది. విద్యార్థులకు వచ్చే నెల జరగనున్న పరీక్షలకు రివిజన్ అవటంతో పాటు, కాంపిటేటివ్ పరీక్షల శైలి అర్థం చేసుకోగలుగుతారనే ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. సాధారణంగా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు, స్కూళ్లలో ఒలింపియాడ్ అని, ఐఐటీ అని కోచింగ్ ఇస్తారు. కానీ, ప్రభుత్వ పాఠశాలలు వచ్చేసరికి ఇలాంటివేమీ ఉండవు. అందువల్లే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ ప్రతిభ ప్రోత్సాహక పరీక్షను నిర్వహిస్తుండటం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల గురించి అడిషనల్ కలెక్టర్ ఆలోచించిన తీరు అందరినీ ఆలోచింపజేస్తున్నది. ఇదొక్కటే కాదు.. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు కూడా సిద్ధం చేసే పనిలో ఉన్నారు.

ఈ సమాచారం తెలుసుకున్న పలు కార్పొరేట్ విద్యా సంస్థలు.. ప్రతిభ కలిగిన విద్యార్థులకు చదువుకు సంబంధించిన మెటీరియల్ అందించటంతో పాటు, తమ విద్యాసంస్థల్లో ఉచిత చేర్చుకొనేందుకు ముందుకు వచ్చాయి. ఈ మేరకు అడిషనల్ కలెక్టర్‌తో చర్చలు జరుపుతున్నాయని తెలిసింది. అది సఫలమైతే, మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు మరింత బంగారుమయంగా మారనుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్