||ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ Photo: Twitter ||
ఈవార్తలు, ఇంటర్నేషనల్ న్యూస్: ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్.. ప్రపంచంలోని చాలా దేశాలకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. తమిళ ఈలం ప్రజలకు ఆరాధ్య దైవం. గొరిల్లా పోరాట యోధుడు. 2009లోనే ఈయనను శ్రీలంక ప్రభుత్వం హతమార్చింది. కానీ, ఆయన చనిపోలేదని, బతికే ఉన్నారని చెప్పాడో తమిళ జాతీయోద్యమ నేత పాళ నెడుమారన్. ప్రభాకరన్ సమ్మతితో తాను ఈ ప్రకటన చేస్తున్నానని వెల్లడించారు. సోమవారం తంజావూరులో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ప్రభాకరన్ సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలోనే ప్రజల్లోకి వస్తారని తెలిపారు. శ్రీలంకలో
రాజపక్స ప్రభుత్వం కూలిపోవడం, అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ప్రభాకరన్ బయటికి వచ్చి ప్రజలకు ప్రకటనలు ఇస్తారని వివరించారు. అయితే, ప్రభాకరన్ ప్రస్తుతం ఎక్కడున్నారు అన్న విషయాన్ని మాత్రం నెడుమారన్ బయటపెట్టలేదు. కానీ, ప్రభాకరన్‌ను చంపేశామని 2009లోనే శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. డీఎన్‌ఏ పరీక్షల ద్వారానూ మృతదేహాన్ని కన్ఫార్మ్ చేసుకున్నామని వెల్లడించింది. తాజాగా నెడుమారన్ ప్రకటనతో పలు దేశాలు ఆశ్చర్యానికి గురయ్యాయి.
ప్రభాకరన్‌ను తన అనుంగులు ముద్దుగా పెద్ద పులి అని పిలుచుకుంటారు. ఈయన ప్రపంచంలోనే అత్యంత గొప్ప గెరిల్లా యోధుడు. శ్రీలంకలోని తమిళుల కుటుంబం ఈయనది. శ్రీలంకలోని వెలెవట్టితులో 1957 నవంబర్ 26న జన్మించిన ప్రభాకరన్.. శ్రీలంకలో తమిళులపై సింహళీయులు చూపుతున్న వివక్షను ఎత్తి చూపారు. భగత్‌సింగ్, సుభాష్ చంద్రబోస్ అంటే ఇష్టమని, అలెగ్జాండర్, నెపోలియన్ జీవితాలు ప్రభావితం చేశాయని చెప్పేవారు. తమిళులపై వివక్షను తట్టుకోలేక 1975లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ)ను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ఎన్నో ఆత్మాహుతి దాడులు చేశారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యలో ఎల్టీటీఈకి కూడా భాగం ఉందని ఆరోపణలు ఉన్నాయి.