(ప్రతీకాత్మక చిత్రం)
ఈవార్తలు, కరీంనగర్: ఉదయం 5 గంటలు మొదలు రాత్రి ఒంటి గంట వరకు కరీంనగర్ నుంచి జగిత్యాల వరకు రహదారి రద్దీగానే ఉంటుంది. కరీంనగర్ నుంచి మొదలు పెడితే, జగిత్యాల చేరే వరకు ఓవర్‌టేక్ చేద్దామన్నా వీలుకానన్ని వాహనాలు ఉంటాయి. పైగా.. అది టూ వే రోడ్డు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ బస్సులు మితిమీరిన వేగంతో, ఓవర్ టేక్ చేస్తూ ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అవతలి వైపు నుంచి ఏ వాహనం వచ్చినా సరే, నాకేం అన్నట్టు ఆర్టీసీ డ్రైవర్లు ఇష్టారీతిన డ్రైవ్ చేస్తున్నారు. దాని ఫలితంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నెల 4న కొండగట్ట స్టేజీ వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆర్టీసీ బస్సుల ఓవర్ స్పీడ్, ఓవర్ టేక్‌ల పరిస్థితి ఎంతలా ఉందో. ఈ రహదారి వరంగల్-నిజామాబాద్‌కు లింక్ ఉండడంతో దాదాపు లారీలు ఇదే మార్గంలో వెళ్తుంటాయి. లారీలు కూడా ఇష్టమొచ్చినట్లు డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
కనీసం వారానికో ప్రమాదం
ఆగస్టు 2న రాజారం వద్ద ఓ ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని బస్సులో ఉన్న మహిళ మృతి చెందింది. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. గత ఏడాది డిసెంబర్‌లోనూ ఆర్టీసీ బస్సును కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. అంతేకాదు.. ఈ నెల 12న గంగాధరలోని పెట్రోల్ బంక్ వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదాలన్నింటికీ కారణం ఏంటీ? అంటే.. రహదారి విస్తరణ చేయకపోవడమే అని ప్రజలు అంటున్నారు. గత కొన్నేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మొర పెట్టుకున్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ రహదారిగా మారినా ప్రయోజనం శూన్యం
వాస్తవానికి కరీంనగర్ - జగిత్యాల రహదారిని జాతీయ రహదారిగా మార్చుతూ కేంద్రం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. కానీ, భూ సేకరణ కొలిక్కి రాకపోవడంతో విస్తరణ పనులు ప్రారంభం కాలేదు. అయితే, ప్రస్తుతం పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా కోర్టులు, ప్రభుత్వాలు త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు. జాతీయ రహదారిని మంజూరు చేయించామని పార్టీలు గొప్పలు చెప్పుకోవడం తప్ప, దీనికి అడుగు ముందుకు వేసింది లేదని చెప్తున్నారు. కరీంనగర్-జగిత్యాల రోడ్డును విస్తరించాలంటే 100 మీటర్ల నుంచి 200 మీటర్ల వరకు విస్తరించాలని ప్రభుత్వం చూస్తున్నది.
నిర్వాసితులకు న్యాయం చేయాలి.. రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి
ఈ రహదారి కొత్తపెల్లి, గంగాధర, పూడూర్, కొండగట్టు, మల్యాల ఎక్స్ రోడ్డు, రాజారం, ధరూర్ మీదుగా వెళ్తున్నది. అయితే, 200 మీటర్ల వరకు రోడ్డు విస్తరణ చేపడితే, రోడ్డు పక్కన ఉన్న ఇళ్లను కూల్చి వేయాల్సిన పరిస్థితి. దీంతో స్థానిక ప్రజలు రోడ్డు విస్తరణపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క కొత్తపల్లిలోనే దాదాపు 1200 కుటుంబాలు ప్రభావితం అవుతాయని అంచనా. అయితే, నిర్వాసితులకు న్యాయం చేసి, ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. వీలైనంత త్వరగా రోడ్డుగా నాలుగు లేన్ల రోడ్డుగా మార్చాలని విన్నవిస్తున్నారు. రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్చామని, మార్పించేందుకు తామే కృషి చేశామని గొప్పలు చెప్పుకొనే పార్టీలు ఇప్పటికైనా రాజకీయాలు మాని, రహదారి విస్తరణ పనులు చేపట్టాలని కోరుతున్నారు.