Jagtial : ఎన్నో ఏళ్ల ఎదురుచూపులు.. జగిత్యాల జిల్లాలో పొంగి పొర్లనున్న కింగ్‌ఫిషర్ బీర్లు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

ఈవార్తలు, జగిత్యాల న్యూస్ : బీర్లలో కింగ్ ఫిషర్లు బీర్లు వేరయా.. తాగితే కింగ్ ఫిషర్ బీర్లే తాగాలని బీర్ల ప్రియులు ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటిది జగిత్యాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గత ఐదేళ్లుగా కింగ్ ఫిషర్లు బీర్లు అమ్మడం లేదు. ఒకానొక దశలో ధర్నాలు చేసే వరకు వెళ్లింది. ఏకంగా ఒక వ్యక్తి ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చి కింగ్‌ఫిషర్ బీర్లు వచ్చేలా చూడాలని అభ్యర్థించాడు. ఇన్నేళ్ల ఎదురు చూపులకు జగిత్యాల బీరు ప్రియులకు అదిరిపోయే న్యూస్ అందింది. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలోని రిటైల్ షాపుల్లో, బార్లలో అన్ని రకాల బ్రాండ్లు ఉండాల్సిందేనని, అందులో కింగ్ ఫిషర్ బీర్లు కూడా ఉండాలని జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్ పీ శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రజావాణిలో కలెక్టర్‌కు దరఖాస్తు చేసిన బీరం రాజేశ్‌కు ఉత్తర్వుల కాపీలను కూడా పంపించారు.

మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉన్న కింగ్ ఫిషర్ బీర్ల వల్ల వైన్స్ వ్యాపారులకు మార్జిన్ తక్కువగా ఉంటుంది. అందుకే వాళ్లంతా ఇతర బ్రాండ్ల అమ్మకాలకే మొగ్గు చూపారు. అయితే, జిల్లా ఎక్సైజ్ అధికారుల తాజా ఉత్తర్వులతో కింగ్ షిఫర్ బీర్లు అందుబాటులోకి రానున్నాయి. ఐఎంఎల్ డిపోలో ఆమోదం పొందిన బ్రాండ్లు విధిగా తమ వైన్స్‌లో విక్రయించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో జగిత్యాలలోని అన్ని వైన్స్‌లలో కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులోకి రానుండటంతో బీర్ల ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ బీర్లు దొరక్క వేరే ప్రాంతం నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేదని, ఇప్పుడిక ఇక్కడే దొరుకుతాయని సంతోషంతో పొంగిపోయారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్