Southwest Monsoon | గురువారం ఉదయం కేరళను నైరుతి రుతుపవనాలు తాకాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. లక్షద్వీప్, కేరళలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వివరించింది.
ప్రతీకాత్మక చిత్రం
వెదర్ న్యూస్, ఈవార్తలు: చల్లచల్లని వార్త.. ఎండలు మండిపోతున్న వేళ వాతావరణ శాఖ అందిస్తున్న శుభవార్త.. దేశంలోకి నైరుతి పవనాలు వచ్చేశాయ్. గురువారం ఉదయం కేరళను నైరుతి రుతుపవనాలు తాకాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. లక్షద్వీప్, కేరళలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వివరించింది. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ సందేశం ఊరట కలిగిస్తోంది.
కాగా, ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని గతంలోనే వాతావరణ శాఖ అంచనా వేసింది. వాయవ్య, ఈశాన్య, తూర్పు రాష్ట్రాల్లో మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. లానినా వచ్చిన సమయాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయని, అందుకు అనుగుణంగానే ప్రస్తుతం రుతుపవనాల కదలిక ఉందని పేర్కొంది.