సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని మోండా మార్కెట్‌లో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక్కడి శ్రీరామ ఎంటర్‌ప్రైజెస్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
అగ్ని ప్రమాదం
సికింద్రాబాద్, డిసెంబర్ 19 (ఈవార్తలు): సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని మోండా మార్కెట్‌లో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక్కడి శ్రీరామ ఎంటర్‌ప్రైజెస్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. మోండా మార్కెట్ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో, అగ్ని ప్రమాదం జరిగి దట్టమైన పొగలు వ్యాపించడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మంటలు చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించకుండా నిరోధించారు. అగ్ని ప్రమాదం సంభవించిన దుకాణంలో ప్లాస్టిక్ వస్తువులు అధికంగా ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.