క్రీడలు ఆరోగ్యకరమైన చైతన్యవంతమైన సమాజానికి మూలస్తంభం అని భారత బాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్స్ విజేత, పద్మభూషణ్ సైనా నెహ్వాల్ తెలిపారు.
సైనానెహ్వాల్
హైదరాబాద్, డిసెంబర్ 19 (ఈవార్తలు): క్రీడలు ఆరోగ్యకరమైన చైతన్యవంతమైన సమాజానికి మూలస్తంభం అని భారత బాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్స్ విజేత, పద్మభూషణ్ సైనా నెహ్వాల్ తెలిపారు. క్రీడల్లో పాల్గొనే విద్యార్థులు విద్యాపరంగా మెరుగ్గా రాణిస్తారని ఆమె అన్నారు. శుక్రవారం హైదరాబాద్, క్రీడాపోటీల ముగింపు ఉత్సవాలకు భారత బాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డీజీపీ డా. అనిల్ కుమార్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సైనా బాడ్మింటన్ ఆడారు. అనంతరం క్రీడా పోటీలలో పాల్గొని విజేతలైన విద్యార్థిని, విద్యార్థులకు ట్రోపీలు, కప్, సర్టిఫికెట్ లను అందజేశారు. ఈ సందర్భంగా సైనా నెహ్వాల్ మాట్లాడుతూ.. విద్యతోపాటు క్రీడలు మానవ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అన్నారు. క్రీడలు వ్యక్తిత్వాన్ని రూపొందించడం, మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, క్రమశిక్షణ ని నేర్పిస్తాయని ఆమె తెలిపారు. తమ రోజువారీ షెడ్యూల్‌లో క్రీడలను చేర్చి, క్రమం తప్పకుండా క్రీడా పోటీలు, టోర్నమెంట్‌లు నిర్వహించాలని సైనా నెహ్వాల్ కోరారు. డా. అనిల్ కుమార్ మాట్లాడుతూ.. క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించి క్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, స్విమ్మింగ్ వంటి ప్రతి క్రీడలలో విద్యార్థులకు పాల్గొనేలా చేసి దేశీయ, అంతర్జాతీయ పోటీలకు పంపడం అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఎస్ఐఎస్ చైర్మన్ దయానంద్ అగర్వాల్, డైరెక్టర్ లు అంజనీ కుమార్ అగర్వాల్, సంజయ్ అగర్వాల్, గర్వ అగర్వాల్, స్పోర్ట్స్ చీఫ్ కోచ్ డా. మురమళ్ళ భారత్ కుమార్, అడ్మిన్ హెడ్ వినోద రంజన్, వైస్ ప్రిన్సిపాల్ పూజ సక్సేనా, హెడ్ ఆఫ్ బోర్డింగ్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.