Heart Problems : శాస్త్రవేత్తల అద్భుత సృష్టి.. బొడ్డు తాడు నుంచి తీసిన మూల కణాలతో గుండె రిపేర్

evarthalu
ప్రతీకాత్మక చిత్రం


(Pic: ప్రతీకాత్మక చిత్రం)

ఈవార్తలు, హెల్త్ న్యూస్: మనిషి జన్యుపరమైన వ్యాధులను దూరం చేసేందుకు ఏండ్లుగా ప్రయత్నాలు చేస్తున్న శాస్త్రవేత్తలు ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగుతున్నారు. దానికోసం మూల కణ చికిత్సను నమ్ముకొన్నారు. తాజాగా, ఓ చిన్నారికి మూల కణ చికిత్స ద్వారా గుండెను బాగు చేసి, ఆరోగ్యవంతుడిని చేశారు. ఈ ఘటన బ్రిటన్‌లో జరిగింది. యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ ఘనతను సాధించారు. ఓ చిన్నారి పుట్టుకతోనే జన్యుపరమైన లోపాలతో గుండెకు రంధ్రాలయ్యాయి. దీంతో అతడి తల్లిదండ్రులు దవాఖానకు తీసుకెళ్లగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని సూచించారు. అదే సమయంలో మూల కణాలపై పరిశోధన చేస్తున్న యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ మాసిమో క్యాపుటో.. చికిత్స చేసేందుకు ముందుకొచ్చారు.

ఎలా చికిత్స చేశారు?

మనిషి పుట్టినప్పుడు తల్లి గర్భానికి, బిడ్డకు అనుసంధానమై ఉండే బొడ్డు తాడు నుంచి మూల కణాలను సేకరించారు. ఆ మూలకణాలతో చిన్న పాటి ప్లాస్టర్లను తయారుచేశారు. వాటిని చిన్నారి గుండె రంధ్రాల వద్ద ప్రవేశపెట్టారు. దీంతో ఆ మూల కణాలు గుండె రంధ్రాన్ని మూసేసి, సాధారణ గుండెగా మార్చేశాయి. ఈ చికిత్సపై వైద్యులు స్పందిస్తూ.. మూల కణ ప్లాస్టర్లు ఉపయోగించి చికిత్స చేయటం వల్ల పిల్లలకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసే బాధ తప్పుతుందని తెలిపారు. ఈ టెక్నాలజీ కోసం బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ నిధులు సమకూర్చింది.

పుట్టే పిల్లల్లో రోజుకు 13 మందిలో హృద్రోగ సమస్యలు

ప్రపంచవ్యాప్తంగా రోజూ పుట్టే పిల్లల్లో దాదాపు 13 మందిలో గుండె సంబంధిత వ్యాధులు ఉంటున్నాయి. గుండె కవాటాల్లోనో, రక్తనాళాల్లోనో సమస్యలు ఏర్పడి ప్రాణాపాయానికి దారితీస్తోంది. ఈ సమస్యలకు మూల కణ చికిత్స కచ్చితంగా దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పిల్లలు పుట్టిన వెంటనే మూల కణాలను దాచి, భవిష్యత్తులో జన్యు సమస్యలు తలెత్తినప్పుడు వాటిని వినియోగించి చికిత్స అందిస్తారు. ప్రస్తుతం మెడికల్ రంగంలో ఎన్నో మూల కణాల స్టోరేజీ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్