WTC | ఒక్క పరాజయంతో.. సంక్లిష్టంలో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్‌.. చివరి టెస్టులో నెగ్గితేనే ముందుకు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ Photo: Twitter||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: సొంతగడ్డపై ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియాకు.. బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో ఎదురుదెబ్బ తగిలింది. తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గి.. ఫుల్‌ జోష్‌లో ఉన్న రోహిత్‌ సేనను.. ఇండోర్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఖంగుతినిపించింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ చేరడంతో పాటు.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌ ప్లేస్‌కు దూసుకెళ్లడమే లక్ష్యంగా మూడో టెస్టు బరిలోకి దిగిన భారత్‌ అనూహ్య పరాజయం ఎదుర్కొంది. ప్రత్యర్థి కోసి సిద్ధం చేసిన స్పిన్‌ పిచ్‌పై.. మనవాళ్లే తంటాలు పడటంతో మూడు రోజుల్లో ముగిసిన పోరులో రోహిత్‌ సేన ఘోర పరాజయం మూటగట్టుకుంది. గత రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపలేకోయిన ఆసీస్‌.. ఇండోర్‌ పట్టుదలగా ప్రయత్నించి 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ వ్యక్తిగత పనిపై స్వదేశానికి తిరిగి వెళ్లగా.. అతడి స్థానంలో జట్టు పగ్గాలు అందుకున్న స్టీవ్‌ స్మిత్‌.. ఆసీస్‌కు విజయం రుచిచూపాడు.

ఈ గెలుపుతో  ఆస్ట్రేలియా నేరుగా డబ్లూ్యటీసీ ఫైనల్‌కు అర్హత సాధించగా.. భారత్‌ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. వన్డే ప్రపంచకప్‌, టీ20 వరల్డ్‌ కప్‌ తరహాలో.. సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ విశ్వ సమరాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టెస్టు చాంపియన్‌షిప్‌కు తెరలేపగా.. తొలి ఎడిషన్‌లో టీమిండియా రన్నరప్‌గా నిలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన గత డబ్లూ్యటీసీ ఫైనల్లో భారత్‌ ఓటమి పాలైన విషయం తెలిసిందే. 

ఈ సారి ఎలాగైన ఐసీసీ గద దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న రోహిత్‌ సేనకు ఇండోర్‌ పరాజయం గట్టి దెబ్బకొట్టింది. తాజా సీజన్‌లో భారత్‌ కేవలం ఒకే టెస్టు ఆడనుండగా.. ఈ నెల 9 నుంచి అహ్మదాబాద్‌ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న చివరి మ్యాచ్‌లో టీమిండియా నెగ్గితే నేరుగా ఫైనల్‌కు చేరనుంది. ఓడినా అవకాశాలు ఉన్నా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇంగ్లండ్‌లోని ఓవల్‌ వేదికగా ఈ ఏడాది జూన్‌ 7 నుంచి 11 వరకు డబ్లూ్యటీసీ ఫైనల్‌ జరుగనుంది. డబ్లూ్యటీసీ రెండో ఎడిషన్‌లో ఇప్పటి వరకు 18 మ్యాచ్‌లాడిన ఆస్ట్రేలియా 11 విజయాలతో 68.52 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో ఉండగా.. టీమిండియా 17 మ్యాచ్‌ల్లో పది విజయాలతో 60.29 పాయింట్లు ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో కొనసాగుతోంది.

బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌ నాలుగో టెస్టులో ఓడినా.. ఆస్ట్రేలియా అగ్రస్థానంతోనే డబ్లూ్యటీసీ ఫైనల్‌కు చేరనుంది. అహ్మదాబాద్‌ పోరులో భారత్‌ విజయం సాధిస్తే.. 62.5 పాయింట్లతో ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకుంటుంది. ఒకవేళ ఓడితే.. 56.94 పాయింట్లకు పడిపోనుంది. అప్పుడు శ్రీలంక-న్యూజిలాండ్‌ సిరీస్‌ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. తాజా ఎడిషన్‌లో 10 టెస్టులాడి ఐదింట నెగ్గిన శ్రీలంక ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం 53.33 పాయింట్లతో ఉన్న శ్రీలంక.. ఈ నెల 9 నుంచి న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది. అందులో లంక 2-0తో నెగ్గితే భారత్‌ ఫైనల్‌ ఆశలు అడియాశలవనున్నాయి. ఒకవేళ ఆ సిరీస్‌లో లంక ఒక మ్యాచ్‌ ఓడినా.. భారత్‌ ముందంజ వేస్తుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్