||భారత రెజ్లర్లు, ఫొటో: ట్విట్టర్ ||
ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్: ఒలింపిక్స్‌లో దేశానికి పతకాలు అందించిన మల్లయోధులు.. తమ ఉనికి కోసం చేస్తున్న పోరాటం మూడు రోజులుగా కొనసాగుతోంది. వ్యక్తిగత క్రీడల్లో దేశానికి అత్యధిక ఒలింపిక్ మెడల్స్ అందించిన స్టార్ రెజ్లర్లు చేపట్టిన నిరసన క్రీడా లోకాన్ని విస్మయానికి గురిచేస్తోంది. భారత రెజ్లింగ్ సమాఖ్యలో అవకతవకలు జరగడంతో పాటు.. సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ యువ రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడని స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆరోపించగా..ఈ అంశంపై మూడు రోజులుగా ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. పలువురు రాజకీయ నాయకులు రెజ్లర్లకు సంఘీభావం ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నా.. రెజ్లర్లు మాత్రం ఈ అంశాన్ని రాజకీయం చేయదలచుకోవడం లేదని స్పష్టం చేస్తున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒలింపిక్ పతక విజేలు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, రవి దహియాతో పాటు వినేశ్ మాలిక్, అన్షు మాలిక్ తదితరులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉన్నపలంగా భారత రెజ్లింగ్ సమాఖ్యను రద్దు చేయాలంటూ రెజ్లర్లు పట్టుబడుతుండగా.. ఈ అంశంలో తన తప్పేం లేదని సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ అంటున్నారు. ఈ ఘటనపై 72 గంటల్లో వివరణ ఇవ్వాలని కేంద్ర క్రీడల శాఖ డబ్లూ్యఎఫ్‌ఐని ఆదేశించగా.. తనపై లైంగిక ఆరోపణలు చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని.. పదవి నుంచి వైదొలిగేది లేదని బ్రిజ్ భూషణ్ స్పష్టం చేశారు.
ఫలించని మధ్యవర్తిత్వం..
రెజ్లర్లు ఆందోళన బాటపట్టగానే.. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. చర్చల కోసం మాజీ రెజ్లర్, బీజేపీ నాయకురాలు బబితా ఫొగాట్‌ను రంగంలోకి దింపింది. కామన్వెల్త్ క్రీడల్లో మూడు పతకాలు సాధించిన బబిత.. రెజ్లర్లతో మాట్లాడి డిమాండ్లు నెరవేరుస్తామని హామీ ఇచ్చినా.. వాళ్లు నిరసన విరమించుకోలేదు. ఈ సమస్యను కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు రెజ్లర్లు సామాజిక మాధ్యమాల వేదికగా పేర్కొన్నారు. బ్రిజ్ భూషణ్‌తో తక్షణమే రాజీనామ చేయించడంతో పాటు డబ్లూ్యఎఫ్‌ఐని వెంటనే రద్దు చేయాలనే డిమాండ్‌కు సరైన స్పందన రాలేదని వినేశ్ పొగాట్ చెప్పింది. లైగింక వేధింపులకు గురైన రెజ్లర్ల పేర్లు బయట పెట్టాల్సి వస్తే.. అది భారత క్రీడా చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుందని వినేశ్ చెప్పుకొచ్చింది. ఈ పోరాటాన్ని ఇక్కడితో ఆపేది లేదని.. ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని.. వెల్లడించింది. తమ దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయని రెజ్లర్లు అంటున్న నేపథ్యంలో ఈ అంశంపై బ్రిజ్ భూషణ్ మీడియా సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే.. మీడియా ముందుకెళ్లొద్దని బ్రిజ్ భూషణ్‌కు కేంద్ర క్రీడల మంత్రి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, అనురాగ్ ఠాకూర్ సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో రెజ్లర్లు సమ్మె విరమించారు. విచారణ ముగిసే వరకు బ్రిజ్ భూషణ్ సింగ్ పదవి నుంచి దూరంగా ఉంటారు. విచారణ పూర్తయ్యాక దోషులకు శిక్ష విధించనున్నారు.