WPL | డబ్ల్యూపీఎల్‌ తొలి సీజన్‌ షెడ్యూల్‌ ఇదే.. తొలి మ్యాచ్‌లో ఎవరితో ఎవరంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||వుమెన్ ప్రీమియర్ లీగ్ Photo: Twitter||

ఈ వార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్‌ కోసం బీసీసీఐ షెడ్యూల్‌ విడుదల చేసింది. వచ్చే నెల 4న ప్రారంభం కానున్న డబ్ల్యూపీఎల్.. 26న జరుగనున్న ఫైనల్‌తో ముగియనుంది. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం షెడ్యూల్‌ వివరాలు వెల్లడించింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ తొలి సీజన్‌లో డబ్ల్యూపీఎల్ తొలి సీజన్‌లో 5 జట్లు పాల్గొంటుండగా.. మొత్తం 22 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. లీగ్‌ ఆరంభ పోరులో (మార్చి 4న) గుజరాత్‌ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు డీవై పాటిల్‌ స్టేడియం వేదిక కానుంది. లీగ్‌లో అన్నీ మ్యాచ్‌లు ముంబైలోనే జరుగనున్నాయి. రాత్రి 7.30 నుంచి మ్యాచ్‌లు ప్రారంభించనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.

రెండో మ్యాచ్‌ మార్చి 5న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరుగనుంది. అదే రోజు యూపీ వారియర్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌ మధ్య మూడో పోరు జరుగనుంది. అంటే మార్చి 5న డబ్ల్యూపీఎల్‌లో తొలి డబుల్‌ హెడర్‌ జరుగనుందన్నమాట. లీగ్‌ ఆరంభ మ్యాచ్‌తో పాటు ఎలిమినేటర్‌ (మార్చి 24) మ్యాచ్‌లకు నవీ ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం వేదిక కానుంది. మార్చి 26న బబ్రౌర్న్‌ స్టేడియంలో ఫైనల్‌ నిర్వహించనున్నారు.

‘డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లన్నీ రాత్రి 7.30కు ప్రారంభమవుతాయి. మార్చి 5 (ఆదివారం)న డబ్ల్యూపీఎల్‌లో తొలి డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌ నిర్వహిస్తాం. తొలి పోరులో ఆర్సీబీతో ఢిల్లీ క్యాపిటల్స్‌, రెండో మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో గుజరాత్‌ జెయింట్స్‌ తలపడతాయి. లీగ్‌లో మొత్తం 4 డబుల్‌ హెడర్స్‌ ఉంటాయి. రెండు మ్యాచ్‌లు ఉన్న రోజు తొలి పోరు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో పోరు యధావిధిగా 7.30కు స్టార్ట్‌ అవుతుంది’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా.. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ కోసం సోమవారం ముంబై వేదికగా నిర్వహించిన వేలం అంచనాలకు మించిపోయిన విషయం తెలిసిందే.

టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన కోసం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) అత్యధికంగా రూ. 3.4 కోట్లు వెచ్చించగా.. అంతర్జాతీయ స్టార్లు నటాలియా స్కీవర్‌ (ముంబై), ఆష్లే గార్డ్‌నర్‌ (గుజరాత్‌) చెరో 3.2 కోట్లు దక్కించుకున్నారు. ఫ్రాంచైజీలన్నీ ఆల్‌రౌండర్ల కోసం పోటీపడగా.. దీప్తి శర్మను రూ. 2.6 కోట్లకు యూపీ జట్టు చేజిక్కించుకుంది. భారత ప్లేయర్లలో ఇది రెండో అత్యధికం కావడం విశేషం. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై అజేయ అర్ధశతకం బాదిన జెమీమా రోడ్రిగ్స్‌ (ఢిల్లీ)కు అనూహ్యంగా 2.2 కోట్లు దక్కగా.. భారత కెప్టెన్‌ను హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ను రూ. 1.8 కోట్లకు ముంబై ఇండియన్స్‌ కైవసం చేసుకుంది. ఈ వేలంలో 10 మంది భారత ప్లేయర్లు కోటి రూపాయల మార్క్‌ దాటడం గమనార్హం.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్