తిరుగులేని ముంబై.. డబ్ల్యూపీఎల్ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు.. గుజరాత్‌పై గ్రాండ్‌ విక్టరీ

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్న ముంబై ఇండియన్స్ వుమెన్ Photo: twitter||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: ప్రత్యర్థితో సంబంధం లేకుండా దూసుకెళ్తున్న ముంబై ఇండియన్స్‌ మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన హర్మన్‌ప్రీత్‌ బృందం పది పాయింట్లతో పట్టిక టాప్‌లో నిలిచింది. బీసీసీఐ తొలిసారి నిర్వహిస్తున్న ఈ లీగ్‌లో పరాజయం అన్నదే ఎరుగకుండా దూసుకెళ్తున్న ముంబై మంగళవారం జరిగిన పోరులో 55 పరుగుల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌ను చిత్తు చేసింది. దీంతో లీగ్‌ దశలో మరో మూడు మ్యాచ్‌లు మిగిలుండగానే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. తాజా పోరులో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (30 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో రాణించగా.. యస్తిక భాటియా (44; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌), స్కీవర్‌ బ్రంట్‌ (36; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) సత్తాచాటారు. గుజరాత్‌ బౌలర్లలో ఆష్లే గార్డ్‌నర్‌ 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 107 పరుగులు చేసింది. కెప్టెన్‌ స్నేహ్‌ రాణా (20), హర్లీన్‌ డియోల్‌ (22), సుష్మ వర్మ (18 నాటౌట్‌), సబ్బినేని మేఘన (16) పోరాడినా.. ఫలితం లేకపోయింది. ముంబై బౌలర్లలో బ్రంట్‌, మాథ్యూస్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అర్ధశతకంతో జట్టుకు భారీ స్కోరు అందించిన హర్మన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా బుధవారం యూపీ వారియర్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తలపడనుంది. 

ఐపీఎల్లో రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ను తలపిస్తున్న హర్మన్‌ బృందం.. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. ఇప్పటి వరకు జరిగిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ముంబై జట్టు ఏ ఒక్కరిపైనో ఆధారపడకుండా.. సమిష్టి ఆటతీరుతో విజయతీరాలకు చేరింది. తాజా పోరులో ఓపెనర్‌ హీలీ మాథ్యూస్‌ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరగగా.. యస్తిక, బ్రంట్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ వీలుచిక్కినప్పుడల్లా బౌండ్రీలతో స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. రెండో వికెట్‌కు 74 పరుగులు జోడించిన అనంతరం బ్రంట్‌ ఔట్‌ కాగా.. కాసేపటికే యస్తిక ఆమెను అనుసరించింది. ఈ దశలో గుజరాత్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో ఆకట్టుకోవడంతో పరుగుల రాక కష్టమైంది. అయితే ఆఖర్లో హర్మన్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌తో విజృంభించడంతో ముంబై మంచి స్కోరు చేయగలిగింది. గార్డ్‌నర్‌, సదర్‌లాండ్‌ ఓవర్లలో రెండేసి ఫోర్లు బాదిన హర్మన్‌ చివరి ఓవర్‌లో ఔటయ్యేంత వరకు అదే దూకుడు కొనసాగించింది. సదర్‌లాండ్‌ వేసిన 19వ ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లు బాదిన హర్మన్‌.. ఆఖరి ఓవర్‌లో బౌండ్రీతో హాఫ్‌సెంచరీ తన పేరిట లిఖించుకుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్