అచ్చం అలాగే.. ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌ తరహాలోనే డబ్ల్యూపీఎల్‌.. నమ్మడం లేదా ఐదే ఈ వార్త చదివేయండి

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||డబ్ల్యూపీఎల్ Photo: Twitter||

ఈ వార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్‌ లీగ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఐపీఎల్‌ తరహాలోనే డబ్ల్యూపీఎల్‌ కూడా తొలి మ్యాచ్‌తోనే విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకుంది. ఐసీసీ 2007లో తొలిసారి టీ20 ప్రపంచకప్‌ నిర్వహించగా.. ఏడాది తిరగకముందే భారత్‌లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కు అంకురార్పణ జరిగింది. పొట్టి ఫార్మాట్‌ను అభిమానులకు మరింత చేరువ చేసేందుకు ప్రారంభమైన ఫ్రాంచైజీ క్రికెట్‌లో తొలి మ్యాచ్‌ 2008 ఏప్రిల్‌ 18న బెంగళూరు వేదికగా జరిగింది. అంతర్జాతీయ క్రికెట్‌లో పెను మార్పులు తీసుకొచ్చిన ఐపీఎల్‌ తరహాలోనే తాజాగా మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్లూ్యపీఎల్‌)కు తెరలేచింది. ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌కు, డబ్లూ్యపీఎల్‌ తొలి పోరుకు చాలా సారూప్యతలు కనిపిస్తున్నాయి. 

ఐపీఎల్‌లో మెక్‌కల్లమ్‌ మెరుపులు 

ఐపీఎల్‌ తొలి సీజన్‌ ఆరంభం పోరులో సౌరవ్‌ గంగూలీ సారథ్యంలోని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో రాహుల్‌ ద్రవిడ్‌ నాయకత్వంలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తలపడింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. గంగూలీ (10)తో పాటు రికీ పాంటింగ్‌ (20), డేవిడ్‌ హస్సీ (12) విఫలమైనా.. బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (73 బంతుల్లో 158 నాటౌట్‌; 10 ఫోర్లు, 13 సిక్సర్లు) బెంగళూరు బౌలర్లను ఊచకోత కోశాడు. తొలి ఓవర్‌లో క్రీజులో అడుగుపెట్టిన ఈ న్యూజిలాండ్‌ స్టార్‌.. చివరి వరకు అజేయంగా నిలిచి క్రికెట్‌ చరిత్రలోనే గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌తో కదంతొక్కాడు. చిన్నస్వామి స్టేడియంలో మెక్‌కల్లమ్‌ సిక్సర్ల జడివానకు అభిమానులు తడిసి ముద్దయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో ఒక్క మ్యాచ్‌తోనే ఐపీఎల్‌కు ఇతోధిక గుర్తింపు దక్కగా.. లక్ష్యఛేదనలో బెంగళూరు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. 19 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటైంది. ప్రవీణ్‌ కుమార్‌ (18 నాటౌట్‌) ఒక్కడే రెండంకెల స్కోరు చేయగా.. ద్రవిడ్‌ (2), వసీం జాఫర్‌ (6), విరాట్‌ కోహ్లీ (1), కలీస్‌ (8), కామెరూన్‌ వైట్‌ (6), మార్క్‌ బౌచర్‌ (7), బాలచంద్ర అఖిల్‌ (0) ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 

హర్మన్‌ హరికేన్‌.. 

ఇక డబ్లూ్యపీఎల్‌ విషయానికి వస్తే.. అచ్చం ఐపీఎల్‌ తరహాలోనే టాస్‌ ఓడిన ముంబై ఇండియన్స్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. అప్పుడు మెక్‌కల్లమ్‌ దంచికొడితే.. ఇప్పుడు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (30 బంతుల్లో 65; 14 ఫోర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌తో విరుచుకుపడింది. అప్పుడు కోల్‌కతా 140 పరుగుల తేడాతో గెలిస్తే.. ఇప్పుడు ముంబై 143 రన్స్‌తో విజయం సాధించింది. ఛేదనలో అప్పుడు బెంగళూరు 82 పరుగులకు కుప్పకూలితే.. ఇప్పుడు గుజరాత్‌ 64 రన్స్‌కు పరిమితమైంది. ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌ చేజింగ్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన ప్రవీణ్‌ కుమార్‌ ఒక ఫోర్‌, రెండు సిక్సర్లు కొడితే.. తాజా మ్యాచ్‌లో దయాలన్‌ హేమలత కూడా అచ్చం అలాగే ఒక ఫోర్‌, రెండు సిక్సర్లు బాదింది. వీరిద్దరూ నాటౌట్‌గానే నిలువడం కొసమెరుపు!


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్