||Photo: Twitter||
ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా గుర్తింపు తెచ్చుకున్న ముంబై ఇండియన్స్.. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లోనూ అదే హవా కొనసాగించింది. మహిళల కోసం భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) తొలిసారి నిర్వహించిన డబ్లూ్యపీఎల్లో ముంబై జట్టు టైటిల్ ఎగరేసుకుపోయింది. ఐపీఎల్లో ఐదు టైటిల్స్‌తో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న ముంబై ఇండియన్స్.. ఇప్పుడు మహిళల లీగ్‌లో తొలి సీజన్‌లో విజేతగా నిలిచింది. సమిష్టి ప్రదర్శనతో పాటు సీజన్ ఆసాంతం నిలకడ కనబర్చిన ముంబై ఇండియన్స్ తొలి టైటిల్‌ను సగర్వంగా ముద్దాడింది. చివరి ఓవర్ వరకు హోరాహోరీగా సాగిన తుదిపోరులో ఢిల్లీని చిత్తుచేసింది. ఆదివారం ఇక్కడి బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ముంబై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుచేసి చాంపియన్‌గా అవతరించింది.
ఆఖర్లో ఢిల్లీ పోరాటం..
ప్రేక్షకులతో కిక్కిరిసిన బ్రబౌర్న్ మైదానంలో అతిరథ మహారథుల సమక్షంలో సాగిన టైటిల్ ఫైట్‌లో ముంబై ఆకట్టుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (35; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా.. చివర్లో శిఖ పాండే (17 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్), రాధ యాదవ్ (12 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) విలువైన పరుగులు జోడించారు. ఒక దశలో 79 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ.. వంద పరుగులైనా చేస్తుందా అనుకుంటే.. ఆఖరి వికెట్‌కు అనూహ్య పోరాటంతో ఆ జట్టు పోరాడే స్కోరు సాధించింది. ముంబై బౌలర్లు విజృంభిస్తున్నా.. ఢిల్లీ టెయిలెండర్లు కడవరకు పోరాడారు. భారత జాతీయ జట్టు తరఫున ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న శిఖ పాండే, రాధ యాదవ్ అచ్చం ప్రొఫెషనల్ బ్యాటర్ల తరహాలో చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరూ అభేద్యమైన పదో వికెట్‌కు 52 పరుగులు జోడించడంతో ఢిల్లీ కోలుకోగలిగింది. ముంబై బౌలర్లలో హీలీ మాథ్యూస్ 4 ఓవర్లలో 2 మెయిడిన్లు వేసి 5 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా.. ఇస్సీ వాంగ్ 3, అమెలియా కెర్ర్ రెండు వికెట్లు తీశారు.
హీలీ మాథ్యూస్‌కు పర్పుల్ క్యాప్
ఓ మోస్తారు లక్ష్యఛేదనలో ముంబై ఏమాత్రం తొందరపడలేదు. నిదానంగా ఆడిన హర్మన్‌ప్రీత్ బృందం 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. స్కీవర్ బ్రంట్ (55 బంతుల్లో 60 నాటౌట్; 7 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో రాణించగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (37; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఢిల్లీ బౌలర్లలో రాధ యాదవ్, జెస్ జాన్సెన్ చెరో వికెట్ పడగొట్టారు. ఒక దశలో ముంబై విజయానికి 12 బంతుల్లో 21 పరుగులు అవసరం కాగా.. ముంబై ఏమాత్రం ఇబ్బంది పడలేదు. స్కీవర్ ఒక ఫోర్, అమెలియా కెర్ర్ రెండు ఫోర్లు బాదడంతో 19వ ఓవర్లో 16 పరుగులు రావడంతోనే మ్యాచ్ ముంబై వైపు మొగ్గుచూపింది. ఇక చివరి ఓవర్‌లో విజయానికి 5 పరుగులు అవసరం కాగా.. మూడో బంతికి బౌండ్రీ బాదిన స్కీవర్ లాంఛనం పూర్తి చేసింది. తొలి సీజన్‌లో 16 వికెట్లు పడగొట్టిన ముంబై స్పిన్నర్ హీలీ మాథ్యూస్ పర్పుల్ క్యాప్ అందుకుంది. ఇక సీజన్‌లో 345 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్‌కు ఆరెంజ్ క్యాప్ దక్కింది.