ఇది కదా కొట్టుడంటే..డబ్ల్యూపీఎల్‌లో అలీసా హీలీ వీరవిహారం.. యూపీపై బెంగళూరు ఘనవిజయం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||అలీసా హీలీ Photo: Twitter||

ఈ వార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: సారథి ముందుండి నడిపిస్తే ఎలా ఉంటుందో.. అలీసా హీలీ నిరూపించింది. ప్రత్యర్థిపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం ఎలా ప్రదర్శించాలో.. బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా ఎలా విరుచుకుపడాలో హీలీ ఒక్క ఇన్నింగ్స్‌తో ప్రపంచానికి చాటింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్లూ్యపీఎల్‌) తొలి సీజన్‌లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో హీలీ సారథ్యంలోని యూపీ వారియర్స్‌ 10 వికెట్ల తేడాతో స్మృతి మంధన నాయకత్వంలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)పై విజయం సాధించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన హీలీ 47 బంతుల్లో 18 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో అజేయంగా 96 పరుగులు చేసింది.

డబ్ల్యూపీఎల్‌లో తొలి సెంచరీ చేసేలా కనిపించినా.. జట్టు ప్రయోజనాలకే పెద్ద పీట వేసిన హీలీ వ్యక్తిగత రికార్డును పెద్దగా పట్టించుకోలేదు. ఒక పరుగు చేస్తే జట్టు గెలుస్తుందన్న సమయంలో హీలీ 95 పరుగులతో క్రీజులో నిలువగా.. సిక్సర్‌ బాదితే మూడంకెల స్కోరు సాధ్యమయ్యేది. కానీ సింగిల్‌తో సరిపెట్టుకోవడంతో శతకానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆమెకు మరో ఓపెనర్‌ దేవిక వైద్య (31 బంతుల్లో 36 నాటౌట్‌; 5 ఫోర్లు) చక్కటి సహకారం అందించింది.

ఆర్సీబీకి ఇక కష్టమే

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. ఎలీసా పెర్రీ (39 బంతుల్లో 52; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌) అర్ధశతకం సాధించగా.. సోఫియా డివైన్‌ (36) రాణించింది. కెప్టెన్‌ స్మృతి మంధన (4), కనిక అహుజ (8), హీథర్‌ నైట్‌ (2), శ్రేయాంక (15), బర్న్స్‌ (12), రిచా ఘోష్‌ (1) విపలమయ్యారు. ఒక్కరు కూడా కనీస ప్రతిఘటన కనబర్చలేకపోవడంతో బెంగళూరు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. యూపీ వారియర్స్‌ బౌలర్లలో సోఫియా ఎకెల్‌స్టోన్‌ 4, దీప్తి శర్మ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో యూపీ వారియర్స్‌ 13 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 139 పరుగులు చేసింది. అలీసా హీలీ, దేవిక వైద్య చెలరేగడంతో యూపీ వికెట్‌ కోల్పోకుండా విజయం సాధించింది.

దీంతో లీగ్‌లో యూపీ రెండో విజయం నమోదు చేసుకోగా.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓడింది. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో జరుగుతున్న డబ్లూ్యపీఎల్‌ తొలిసీజన్‌లో ఇక రాయల్‌ చాలెంజర్స్‌ ముందంజ వేయాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలువడంతో పాటు ఇతర సమీకరణాలు కూడా సహకరించాల్సి ఉంది. అటు పురుషుల ఐపీఎల్లో బెంగళూరు తొలి ట్రోఫీ కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తుంటే.. ఇటు మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో స్మృతి మంధన సారథ్యంలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు బోణీ కొట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా ఫలితం లేకపోతోంది. స్మృతి, సోఫియా డివైన్‌, ఎలీసా పెర్రీ, హీతర్‌ నైట్‌, రిచా ఘోష్‌, ఎరిన్‌ బర్న్స్‌, రేణుక సింగ్‌ వంటి నాణ్యమైన ప్లేయర్లు అందుబాటులో ఉన్నా.. బెంగళూరు పాయింట్ల పట్టికలో ఖాతా తెరవలేకపోతోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్