సిరీస్‌పై టీమిండియా కన్ను.. భారత్‌, ఆస్ట్రేలియా రెండో వన్డేకు వైజాగ్‌ సిద్ధం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||విశాఖ స్టేడియం Photo: Twitter||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: రసవత్తరంగా సాగిన తొలి పోరులో పైచేయి సాధించిన టీమ్‌ఇండియా.. విశాఖపట్నం వేదికగా రెండో వన్డేకు సిద్ధమైంది. బౌలర్ల ప్రతాపానికి మిడిలార్డర్‌ సహకారం తోడవడంతో వాంఖడే మ్యాచ్‌లో సునాయాసంగా గెలుపొందిన భారత్‌.. అదే జోరులో సిరీస్‌ పట్టేయాలని భావిస్తుంటే.. సమం చేసేందుకు కంగారూలు కసరత్తులు చేస్తున్నారు. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రాకతో భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌కు మరింత బలం చేకూరినౖట్లెంది. సమిష్టి ప్రదర్శనతో ‘బోర్డర్‌-గవాస్కర్‌’ సిరీస్‌ చేజిక్కించుకున్న టీమ్‌ఇండియా.. ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా ఒడిసి పట్టేందుకు రెడీ అయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో నెగ్గి ఫుల్‌ జోష్‌లో ఉన్న భారత్‌.. ఆదివారం వైజాగ్‌లో ఆస్ట్రేలియాతో రెండో మ్యాచ్‌ ఆడనుంది. వ్యక్తిగత కారణాల వల్ల తొలి మ్యాచ్‌కు దూరమైన రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తిరిగి బరిలో దిగనున్నాడు. ఈ ఏడాది ఆఖర్లో భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ జరుగనున్న నేపథ్యంలో ఈ సిరీస్‌ను రిహార్సల్‌గా భావిస్తున్న ఆస్ట్రేలియా.. వాంఖడే మ్యాచ్‌లో మంచి ప్రదర్శనే చేసినా.. కీలక సమయాల్లో పట్టు చేజార్చి పరాజయం వైపు నిలిచింది. 

బ్యాటింగే బలంగా..

గత మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యఛేదనలో టాపార్డర్‌ విఫలమైనా.. హార్దిక్‌, జడేజాతో కలిసి రాహుల్‌ మ్యాచ్‌ను ముగించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో పెద్దగా ఆకట్టుకోలేక జట్టులో చోటు కోల్పోయిన రాహుల్‌.. తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. రోహిత్‌ రాకతో ఇషాన్‌కు ఉద్వాసన తప్పకపోవచ్చు. గిల్‌తో కలిసి రోహిత్‌ ఓపెనింగ్‌ చేయనుండగా.. విరాట్‌ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. గత మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన కోహ్లీ.. తెలుగు ప్రేక్షకుల సమక్షంలో భారీ ఇన్నింగ్స్‌ ఆడుతాడా చూడాలి. తనకు అచ్చొచ్చిన మైదానంలో కోహ్లీ శతక్కొట్టాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. తొలి వన్డేలో గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగిన సూర్యకుమార్‌ యాదవ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రాహుల్‌, పాండ్యా, జడేజాతో మిడిలార్డర్‌ బలంగా కనిపిస్తున్నది. సిరాజ్‌, శార్దూల్‌తో కలిసి షమీ పేస్‌ భారాన్ని మోయనుండగా.. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా కుల్దీప్‌కు చోటు ఖాయమే. మరోవైపు గాయం నుంచి పూర్తిగా కోలుకోని వార్నర్‌.. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడా చూడాలి. గత వన్డేలో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన మార్ష్‌తో పాటు స్మిత్‌, లబుషేన్‌, హెడ్‌, గ్రీన్‌, మ్యాక్స్‌వెల్‌, స్టొయినిస్‌ కలిసికట్టుగా రాణిస్తే.. ఆసీస్‌ను ఆపడం కష్టమే. 

వరుణుడు కరుణించేనా.. 

విశాఖపట్నం వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉంది. గత రెండు రోజులుగా ఇక్కడ చిరుజల్లులు కురుస్తుండగా.. ఆదివారం కూడా వరుణుడు పలకరించే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర వెల్లడించింది. ఇక విశాఖ పిచ్‌ బ్యాటింగ్‌కు స్వర్గధామం కాగా.. చివరిసారిగా ఇక్కడ జరిగిన వన్డేలో వెస్టిండీస్‌పై టీమిండియా 5 వికెట్లకు 387 పరుగులు చేసింది. రోహిత్‌, రాహుల్‌ సెంచరీలు బాదారు. 

* వైజాగ్‌ వేదికగా టీమ్‌ఇండియా ఇప్పటి వరకు తొమ్మిది వన్డేలు ఆడగా.. అందులో ఏడింట విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో ఓడగా.. ఒకటి ‘టై’గా ముగిసింది. 

* 118, 117, 99, 65, 157*, 0.. ఈ వేదికపై కోహ్లీ ఆడిన ఆరు వన్డేల్లో చేసిన స్కోర్లివి. ఈ గణాంకాలు చాలు విరాట్‌కు వైజాగ్‌ అచ్చొచ్చిన స్టేడియం అని చెప్పేందుకు!


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్