||స్టీవ్ స్మిత్ సూపర్ క్యాచ్ Photo: twitter||
ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్: ఆసీస్ స్టాండిన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరోసారి తన విలువ చాటుకున్నాడు. ఈ సిరీస్‌లో బ్యాట్‌తో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన స్మిత్.. మైదానంలో తన ఫీల్డింగ్‌తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇచ్చిన క్యాచ్‌ను స్మిత్ నమ్మశక్యం కాని రీతిలో అందుకున్నాడు. అబాట్ వేసిన ఇన్నింగ్స్ పదో ఓవర్ రెండో బంతిని పాండ్యా.. కట్ చేయబోగా ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్ కండ్లు చెదిరే రితిలో క్యాచ్ అందుకున్నాడు. పక్షిలా కుడి వైపు గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో రెప్పపాటులో బంతిని ఒడిసి పట్టాడు. మ్యాచ్ అనంతరం దీనిపై స్పందించిన స్మిత్ ‘క్యాచ్ ఆఫ్ ది సెంచరీ అనుకోవడం లేదు కానీ, హార్దిక్ వంటి ప్రధాన ప్లేయర్‌ను పెవిలియన్‌కు చేర్చడంతో ఆనందమేసింది. ఎంత లక్ష్యమైతే బాగుంటుందో కూడా ఆలోచించలేదు. పిచ్ నుంచి సహకారం లభిస్తుండటంతో మా పేసర్లు దాన్ని చక్కగా వినియోగించుకున్నారు’ అని అన్నాడు. కాగా.. తొలి వన్డేలో విజయం సాధించిన టీమ్‌ఇండియా.. రెండో మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన 26 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లీ (31) టాప్ స్కోరర్ కాగా.. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 5, అబాట్ 3, ఎలీస్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆసీస్ 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 121 పరుగులు చేసింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 51 నాటౌట్; 10 ఫోర్లు), మిషెల్ మార్ష్ (36 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) దంచికొట్టారు.
నాని హల్‌చల్..
రెండో వన్డే ప్రారంభానికి ముందు వైజాగ్ మైదానంలో సినీ హీరో నాని హల్‌చల్ చేశాడు. అతడు నటించిన దసరా సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఆదివారం మ్యాచ్‌కు నాని హజరయ్యాడు. కామెంటేటర్లతో కలిసి సరదాగా డ్యాన్స్ చేసిన నాని.. టీమ్‌ఇండియా ప్లేయర్లకు తన సినిమా పేర్లను ఆపాదించి సందడి చేశాడు. సునీల్ గవాస్కర్, అరోన్ ఫించ్, ఎమ్మెస్కే ప్రసాద్‌తో నాని ప్రత్యేకంగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన అభిమాన క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అని నాని వెల్లడించాడు. ఒకప్పుడు సచిన్ ఔటైతే టీవీలు ఆపేసేవాళ్లమని చెప్పాడు. ఈ క్రమంలో తన సినిమాల్లో ‘జెంటిల్‌మెన్’ పేరు రోహిత్ శర్మకు సరిగ్గా సరిపోతుందన్న నాని.. విరాట్ కోహ్లీని ‘గ్యాంగ్ లీడర్’తో పోల్చాడు. ఇక పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ‘పిల్ల జమిందార్’ అని వ్యాఖ్యానించాడు.