IND vs SL : సచిన్ టెండుల్కర్‌ను మించిపోయిన విరాట్ కోహ్లీ.. పరుగుల దాహానికి అడ్డే లేదుగా..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

|| విరాట్ కోహ్లీ సెంచరీల దాహం, Photo: Twitter ||

ఈవార్తలు, క్రికెట్ న్యూస్: రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ మరో ఘనత తన పేరిట రాసుకున్నాడు. ఈ ఏడాది బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో అదరగొట్టిన విరాట్‌.. అంతర్జాతీయ వన్డేల్లో 45వ శతకం తన పేరిట రాసుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ 49 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. విరాట్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ (30), హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ (29), శ్రీలంక మాజీ ఓపెనర్‌ జయసూర్య (28) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌ వన్డే సెంచరీల్లో మాస్టర్‌ కంటే నాలుగు శతకాలు దూరంలో ఉన్న విరాట్‌ కోహ్లీ.. శ్రీలంకపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌ను వెనక్కి నెట్టాడు. లంకపై మాస్టర్‌ బ్లాస్టర్‌ 8 శతకాలు నమోదు చేయగా.. గువాహటి వన్డే ప్రదర్శనతో విరాట్‌ సెంచరీల సంఖ్య 9కి చేరింది. అన్ని ఫార్మాట్లలో కలిపి సచిన్‌ టెండూల్కర్‌ 100 శతకాల (టెస్టుల్లో 51+వన్డేల్లో 49) తో టాప్‌లో నిలువగా.. విరాట్‌ కోహ్లీ 73 సెంచరీల (టెస్టుల్లో 27+వన్డేల్లో 45+టీ20ల్లో 1)తో రెండో స్థానంలో ఉన్నాడు. 

సూపర్‌ ఇన్నింగ్స్‌..

కెరీర్‌ ఆరంభంలో ఉన్నత శిఖరాలకు చేరుకున్న విరాట్‌ కోహ్లీ.. ఆ తర్వాత తాను నెలకొల్పిన ప్రమాణాలను అందుకోలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. మధ్యలో దాదాపు మూడేండ్ల కాలం అన్ని ఫార్మాట్లలో కలిపి ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. దీంతో కింగ్‌ పనైపోయిందనే విమర్శలు వినిపించాయి. అయితే ప్రతి మ్యాచ్‌లో రాణిస్తున్నా.. భారీ ఇన్నింగ్స్‌లు ఆడకపోవడంతో అతడిపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో గతేడాది జరిగిన ఆసియా కప్‌ టీ20 టోర్నీలో అఫ్గానిస్థాన్‌పై సెంచరీతో తిరిగి తన మార్క్‌ చూపిన విరాట్‌.. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో విశ్వరూపం కనబర్చాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనైతే.. కోహ్లీ వీరవిహారం చేశాడు. ఆశలే లేని స్థితి నుంచి అద్వితీయమైన ఆటతీరుతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే పొట్టి ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడటంతో భారత్‌ రిక్తహస్తాలతోనే వెనుదిరిగింది. ఆ తర్వాత బంగ్లాతో వన్డే సిరీస్‌లో సెంచరీ నమోదు చేసిన విరాట్‌.. శ్రీలంకతో సిరీస్‌లో అదే జోరు కొనసాగిస్తూ పూర్తి సాధికారిక ఇన్నింగ్స్‌ ఆడాడు. 

47 బంతుల్లో 75 పరుగులు

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గువాహటి వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (67 బంతుల్లో 83; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) శుభ్‌మన్‌ గిల్‌ (60 బంతుల్లో 70; 11 ఫోర్లు) దంచికొట్టారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 143 పరుగులు జోడించాక గిల్‌ ఔట్‌ కాగా.. అక్కడి నుంచి విరాట్‌ మోత మొదలైంది. తొలి 20 బంతుల్లో 28 పరుగులు చేసిన కోహ్లీ.. ఆ తర్వాత 20 బంతుల్లో 10 పరుగులు చేశాడు. ఇక అక్కడి నుంచి గేర్‌ మార్చిన కోహ్లీ మిగిలిన 47 బంతుల్లో 75 పరుగులు పిండుకొని లంకేయులకు చుక్కలు చూపాడు. తన ట్రేడ్‌మార్క్‌ కవర్‌ డ్రైవ్‌లతో పాటు.. పుల్‌, లాఫ్టెడ్‌ షాట్లతో విజృంభించిన విరాట్‌.. సింగిల్స్‌, డబుల్స్‌తో స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. కసున్‌ రజిత బౌలింగ్‌లో లాంగాఫ్‌ దిశగా బంతిని నెట్టి సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్‌.. తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. టాప్‌-5 ఆటగాళ్లు వందకుపైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు రాబట్టడంతో టీమ్‌ఇండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్