||విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ Photo: Twitter||
ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్: సుదీర్ఘ నిరీక్షణకు తెరదింపుతూ.. మూడేండ్ల తర్వాత విరాట్ కోహ్లీ టెస్టు సెంచరీతో కదంతొక్కిన వేళ టీమ్‌ఇండియా భారీ స్కోరు చేసింది. నిర్జీవమైన పిచ్‌పై ఆసీస్‌కు దీటుగా మనవాళ్లు దంచికొట్టగా.. రోహిత్ సేనను నిలువరించేందుకు కంగారూలు ఆపసోపాలు పడ్డారు. ఒక ఎండ్‌లో కోహ్లీ క్రీజులో పాతుకుపోగా.. తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ దుమ్ములేపారు. 2019 నవంబర్ నుంచి సుదీర్ఘ ఫార్మాట్‌లో సెంచరీ చేయని విరాట్ కోహ్లీ (364 బంతుల్లో 186; 15 ఫోర్లు) ఎట్టకేలకు మూడంకెల స్కోరు అందుకున్నాడు. దీంతో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న వికెట్‌పై స్వేచ్ఛగా ఆడిన మాజీ కెప్టెన్ ఒక దశలో డబుల్ సెంచరీ చేసేలా కనిపించినా.. సహచరులు వెనుదిరుగుతుండటంతో భారీ షాట్‌కు యత్నించి ద్విశతకానికి 14 పరుగుల దూరంలో పెవిలియన్ చేరాడు. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (79; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ (44; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా ఆడారు. వెన్ను నొప్పి కారణంగా శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు రాకపోగా.. టీమ్‌ఇండియా పది మందితోనే ఇన్నింగ్స్ ముగించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియాన్, టాడ్ మార్ఫి చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ఆదివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 3 పరుగులు చేసింది. చేతిలో 10 వికెట్లు ఉన్న ఆసీస్.. భారత స్కోరుకు ఇంకా 88 పరుగులు వెనుకబడి ఉంది. నేడు ఆటకు ఆఖరి రోజు.
డబుల్ మిస్..
ఓవర్‌నైట్ స్కోరు 289/3తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్‌ఇండియా.. ఆడుతూ పాడుతూ ముందుకు సాగింది. కోహ్లీ పూర్తి నియంత్రణతో షాట్లు ఆడగా.. మార్ఫి బౌలింగ్‌లో జడేజా ఔటయ్యాడు. అయ్యర్ వెన్నునొప్పితో బాధపడుతుండటంతో ఆరో స్థానంలో భరత్ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 2019లో బంగ్లాదేశ్‌పై డే అండ్ నైట్ టెస్టులో సెంచరీ చేసిన అనంతరం టెస్టు ఫార్మాట్‌లో విరాట్ మూడంకెల స్కోరు చేయడం ఇదే తొలిసారి. దీంతో మూడు ఫార్మాట్లలో కలిపి విరాట్ 75వ శతకం తన పేరిట లిఖించుకున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వంద శతకాలతో టాప్‌లో ఉన్నాడు. ఫోర్లు, సిక్సర్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడిన భరత్ ఉన్నంతసేపు వేగంగా ఆడగా.. అక్షర్ పటేల్ రాకతో ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. అప్పటికే క్రీజులో గంటల తరబడి సమయం గడిపిన కోహ్లీ.. కంగారూ బౌలర్ల సహనాన్ని పరీక్షించగా.. మరో ఎండ్ నుంచి వీలుచిక్కినప్పుడల్లా అక్షర్ భారీ షాట్‌లు ఆడాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఆరోవికెట్‌కు వీరిద్దరూ కలిసి 215 బంతుల్లోనే 162 పరుగులు జోడించడం విశేషం. అయితే అక్షర్‌ను క్లీన్‌బౌల్డ్ చేయడం ద్వారా స్టార్క్ ఈ భాగస్వామ్యాన్ని విడదీయగా.. ఆ తర్వాత అశ్విన్ (7), ఉమేశ్ యాదవ్ (0) వెంటవెంటనే ఔటయ్యారు. భారీ షాట్‌కు యత్నించిన విరాట్.. బౌండ్రీ సమీపంలో లబుషేన్ పట్టిన క్యాచ్‌కు పెవిలియన్ బాటపట్టాడు.