|| వినోద్ కాంబ్లీ దంపతులు, Photo: Twitter ||
ఈ వార్తలు, స్పోర్ట్స్ న్యూస్: పాఠశాల స్థాయి క్రికెట్‌లో అనితర సాధ్య రికార్డులు.. రంజీ ట్రోఫీలో ఎదుర్కొన్న తొలి బంతికే భారీ సిక్సర్.. స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ వేసిన ఒకే టెస్టు ఓవర్‌లో 22 పరుగులు.. జాతీయ జట్టు తరఫున ఆడిన తొలి ఏడు టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు, రెండు సెంచరీలు.. ఇవన్నీ భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కెరీర్ ఘనతలు. అయితే.. కెరీర్ పీక్ స్టేజ్‌లో క్రమశిక్షణా రాహిత్యంతో జట్టులో చోటు కోల్పోయిన వినోద్ కాంబ్లీ.. నానాటికి దిగజారుడు పనులతో వార్తల్లోకెక్కుతున్నాడు. ఆటగాళ్లకిచ్చే పెన్షన్‌తోనే జీవనం సాగిస్తున్నాను.. కాస్త సాయం చేయండి సారూ అంటూ ఇటీవలే బోర్డును మొరపెట్టుకున్న కాంబ్లీ.. తాజాగా మద్యం మత్తులో భార్యపై దాడి చేశాడు. చెడు వ్యసనాలకు బానిసైన తన భర్త కుకింగ్ పాన్‌తో దాడి చేసినట్లు కాంబ్లీ భార్య ఆండ్రియా పేర్కొంది. ఈ మేరకు ఆమె ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. పన్నెండేళ్ల కుమారుడి సమక్షంలోనే కాంబ్లీ తనపై దాడి చేసినట్లు ఆండ్రియా తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో బాంద్రా పోలీసులు కాంబ్లీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆండ్రియా తలకు దెబ్బతగలడంతో ఆమెను హస్పిటల్‌కు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకున్నా.. ఇంతవరకు కాంబ్లీని మాత్రం అదుపులోకి తీసుకోలేదు. ఐపీసీ సెక్షన్ 324, ఐపీసీ సెక్షన్ 504 ప్రకారం కాంబ్లీపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కుమారుడి ముందే తనపై విచక్షణా రహితంగా దాడి చేసిన భర్తను కఠినంగా శిక్షించాలని ఆమె ఫిర్యాదులో కోరింది.
పాఠశాల స్థాయిలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో కలిసి తొలి వికెట్‌కు 664 పరుగులు జోడించి వెలుగులోకి వచ్చిన వినోద్ కాంబ్లీ.. కెరీర్ ఆరంభ దశలో మంచి ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ బాదిన కాంబ్లీ.. జాతీయ జట్టు తరఫున ఆడిన మొదటి ఏడు టెస్టుల్లోనే రెండు డబుల్ సెంచరీలు, రెండు సెంచరీలు బాది ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. మాస్టర్ బ్లాస్టర్‌తో పోల్చితే దూకుడుగా ఆడుతున్న కోహ్లీని అప్పట్లో విశ్లేషకులు ఆకాశానికి ఎత్తారు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్ట్రోక్ ప్లేయర్ అంటూ కితాబిచ్చారు. అందుకు తగ్గట్టుగానే కాంబ్లీ.. టెస్టుల్లో చెలరేగిపోయాడు. ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్‌ను ఎదుర్కొనేందుకే ఇతర ఆటగాళ్లు తెగ ఇబ్బందిపడిపోయే దశలో కాంబ్లీ అతడి ఓవర్‌లో 22 పరుగుల రాబట్టి భేష్ అనిపించుకున్నాడు. అయితే ఈ దూకుడు అతడు చివరి వరకు కొనసాగించలేకపోయాడు. క్రమశిక్షణారాహిత్యంతో వ్యసనాలకు అలవాటు పడి బంగారం లాంటి కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. 24 ఏళ్ల వయసులోనే చివరి టెస్టు ఆడిన కాంబ్లీ 2000 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు.