పురుషుల ఐపీఎల్‌తో పాటు మహిళల ఐపీఎల్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మీడియా హక్కులను వేలం వేసింది. ఈ వేలంలో మీడియా హక్కులను వయాకామ్18 మీడియా సంస్థ దక్కించుకుంది. వచ్చే ఐదేళ్ల వరకు మీడియా హక్కులు ఈ సంస్థకే చెందనున్నాయి. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా మీడియాతో తెలిపారు. మహిళల ఐపీఎల్ మీడియా హక్కులను దక్కించుకున్న వయాకమ్18 సంస్థకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మీడియా హక్కుల కోసం వయాకమ్18 సంస్థ రూ.951 కోట్లు పెట్టేందుకు సిద్ధమైందని వివరించారు. ఒక మ్యాచ్‌కు అది రూ.7.09 కోట్లు చెల్లిస్తుందని వెల్లడించారు. 2023 నుంచి 2027 వరకు మహిళల ఐపీఎల్ మీడియా హక్కులు వయాకమ్18కు చెందుతాయని స్పష్టం చేశారు.
కాగా, మహిళల ఐపీఎల్ తొలి సీజన్ మార్చి 5వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరగనుంది. ఇందులో ఐదు ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి. అయితే, ఐపీఎల్ నిర్వహణ కోసం బీసీసీఐ ఎలాంటి షెడ్యూల్ విడుదల చేయలేదు. ఈ నెల 25న ఫ్రాంచైజీలను ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న మహిళా క్రికెటర్ కు రూ.50 లక్షలు, రూ.40 లక్షలు రూ.30 లక్షలు బేస్ ప్రైజ్ ఉండగా, మిగతా వాళ్లకు రూ.20 లక్షలు, రూ.10 లక్షలుగా కనీస ధరను బీసీసీఐ నిర్ణయించింది.