షఫాలీ పరుగుల సునామీ.. అండర్‌ 19 మహిళల ప్రపంచకప్‌లో యూఏఈపై భారత్‌ ఘనవిజయం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

|| షఫాలీ వర్మ, Photo: Twitter ||

ఈ వార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: విధ్వంసంక వీరుడు వీరేంద్ర సెహ్వాగ్‌ను గుర్తు చేస్తూ.. భారత అండర్‌-19 మహిళల జట్టు ఓపెనర్‌ షఫాలీ వర్మ టీ20 ప్రపంచకప్‌లో విశ్వరూపం కొనసాగిస్తోంది. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి పోరులో దుమ్మురేపిన ఈ యువ ఓపెనర్‌.. సోమవారం జరిగిన మ్యాచ్‌లో రఫ్ఫాడించింది. 34 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 78 పరుగులు సాధించింది. బంతి పడటమే ఆలస్యం దానిపై ఆకలిగొన్న సింహంలా విరుచుకుపడిన షఫాలీ.. 229 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు రాబట్టడం విశేషం. షఫాలీతో పాటు శ్వేత షెరావత్‌ (49 బంతుల్లో 74 నాటౌట్‌; 10 ఫోర్లు), రిచా ఘోష్‌ (29 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టడంతో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. తెలంగాణ అమ్మాయి గొంగిడి త్రిష 5 బంతుల్లో 11 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో యూఏఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 97 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. మన బౌలర్ల ధాటికి యూఏఈ అమ్మాయిలు పరుగులు రాబట్టేందుకు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. భారత బౌలర్లలో షబ్నమ్‌, మన్నత్‌, పర్షవి తలో వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు. 

సూపర్‌ సిక్స్‌కు అర్హత..

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో యంగ్‌ఇండియా సూపర్‌ సిక్స్‌కు అర్హత సాధించింది. గ్రూప్‌-‘డి’లో భాగంగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత్‌.. 4 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతుండగా.. దక్షిణాప్రికా, యూఏఈ చెరో విజయంతో రెండేసి పాయింట్లతో వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ దశలో జరుగుతున్న ఈ లీగ్‌లో భారత్‌ చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో తలపడనుంది. అనుభవం, ఫామ్‌ రిత్యా భారత్‌ విజయం నల్లేరుపై నడకే కాగా.. సూపర్‌ సిక్స్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ వంటి గట్టి ప్రత్యర్థులు ఎదురు కానున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను మనవాళ్లు ప్రాక్టీస్‌ కోసం వినియోగించుకోవాలనుకుంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్