స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ పాత లోగో స్థానంలో కొత్త లోగోను ఆవిష్కరించారు. అయితే, ఆ లోగో ఉన్నది ఉన్నట్టు ఇంటర్నెట్ నుంచి కాపీ కొట్టినట్టుగా స్పష్టం అవుతోంది.
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ పాత, కొత్త లోగోలు
తెలంగాణలో ఏం జరుగుతోంది..? అంటే తెలంగాణలో విగ్రహాల తొలగింపు, లోగోల మార్పు జరుగుతోందని చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మారినప్పటి నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పలు అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలకు మంగళం పాడగా.. అధికారిక చిహ్నాలు, తెలంగాణ తల్లి విగ్రహా మార్పునకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అధికారిక చిహ్నం మార్చాలని నిర్ణయించినా.. సఫలం కాలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. త్వరలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, తాజాగా.. ప్రభుత్వ యంత్రాంగం చేసిన ఒక పని.. తెలంగాణను చూసి దేశం నవ్వే పరిస్థితి దాపురించింది. అసలేం జరిగిందంటే.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ పాత లోగో స్థానంలో కొత్త లోగోను ఆవిష్కరించారు.
అయితే, ఆ లోగో ఉన్నది ఉన్నట్టు ఇంటర్నెట్ నుంచి కాపీ కొట్టినట్టుగా స్పష్టం అవుతోంది. 2015లో కోలకతాకు చెందిన లయన్స్ క్లబ్ తయారుచేసిన లోగోకు రంగులు మార్చి, చిన్నగా డిజైన్ చేర్చి.. దింపేసినట్లుగా తెలుస్తోంది. ‘ఆశాయేన్ 2015’ పేరుతో కోల్‌కతా లయన్స్ క్లబ్ దివ్యాంగ విద్యార్థుల కోసం కోల్‌కతాలోని గీతాంజలి స్టేడియంలో ఆటల పోటీలు నిర్వహించింది. ఆ ఆటల పోటీలకు వాడిన లోగో ఇదే. ఆ లోగోలో చిన్నగా రంగులు మార్చి.. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ లోగోగా పెట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
లోగోను చూసిన పలువురు తెలంగాణవాదులు, బీఆర్ఎస్ నేతలు మక్కున వేలేసుకుంటున్నారు. కేసీఆర్ ఆనవాలు చెరిపేస్తానంటూ పేర్లు, లోగోలు మార్చే పనిపెట్టుకున్న రేవంత్.. మరోసారి తప్పులో కాలేశాడని ఎద్దేవా చేస్తున్నారు. కాకతీయ తోరణం, చార్మినార్ వంటివి కూడా కేసీఆర్ ఆనవాలుగానే రేవంత్ పరిగణిస్తున్నారని.. రాష్ట్ర చిహ్నం మార్పు వివాదంలో అర్థమైందంటూ విమర్శిస్తున్నారు. ఇంటర్నెట్‌లో ఒక వెబ్‌సైట్ నుంచి కాపీ చేసి మక్కీకి మక్కీ దించారని ఆరోపిస్తున్నారు. ఆ చిత్రాలను కూడా జత చేస్తూ.. రేవంత్ సర్కారు తీరును ఎండగడుతున్నారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని కొత్త లోగోను ఉపసంహరించుకొని, పాత లోగోను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.