|| మహ్మద్ సిరాజ్, Photo: Twitter ||
కెరీర్ తొలినాళ్లలో క్రికెట్ కిట్ కొనేందుకు కూడా డబ్బులేని పేదరికం..
తండ్రి ఆటో నడిపితే కాని ఇళ్లు గడవని దీన పరిస్థితి..
సంపాదన కోసం టెన్నిస్ బాల్ టోర్నీలు ఆడిన దైన్యం..
ఎన్నో అడ్డంకులు దాటుకొని దేశవాళీల్లోకి వచ్చిన ఆ కుర్రాడు.. తన వేగంతో ఆకట్టుకొని ఐపీఎల్‌లో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. అదే జోరులో టీమిండియాలో అడుగుపెట్టిన ఈ హైదరాబాదీ.. కెరీర్ తొలినాళ్లలో భారీగా పరుగులు సమర్పించుకుంటూ.. విమర్శల పాలయ్యాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే తన తొలి లక్ష్యమని.. కన్న తండ్రి కడచూపునకు దూరమైన ఆ కుర్రాడే ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని అధిష్టించాడు. గతేడాది కాలంగా బుల్లెట్ ట్రైన్‌లా దూసుకెళ్తున్న హైదరాబాద్ గల్లీబాయ్ మహమ్మద్ సిరాజ్ ఆటతీరుపై ప్రత్యేక కథనం..
ఈ వార్తలు, స్పోర్ట్స్ న్యూస్: ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే నానుడిని అక్షరాల వంట పట్టించుకున్న సిరాజ్.. వన్డేల్లో విజృంభిస్తున్నాడు. 2019లో ఆడిన అరంగేట్ర వన్డేలో వికెట్ పడగొట్టకుండానే భారీగా పరుగులు సమర్పించుకున్న సిరాజ్.. ఆ తర్వాత రెండో మ్యాచ్ ఆడేందుకు దాదాపు మూడేండ్లు వేచి చూడాల్సి వచ్చింది. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ గైర్హాజరీలో జాతీయ జట్టులోకి అడపా దడపా వస్తూ పోతూ ఉన్న సిరాజ్.. గతేడాది కాలంగా జట్టులో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నాడు. నిలకడైన వేగం.. అవసరమైన సమయంలో స్వింగ్ రాబట్టడం.. బ్యాటర్ ఆటతీరుకు అనుగుణంగా బౌన్సర్లు, స్లోవర్ డెలివరీలతో బోల్త కొట్టించగల నైపుణ్యం అతడిని ఇతరుల కంటే భిన్నంగా నిలిపింది. తొలి నాళ్లలో చెత్త బంతులతో ప్రత్యర్థికి పరుగులు చేసే అవకాశమిచ్చి.. వికెట్ల పడగొట్ట లేకపోయిన సిరాజ్.. ఇప్పుడా బలహీనతను అధిగమించాడు. పవర్‌ప్లేలో పదునైన బంతులతో జట్టుకు శుభారంభం ఇవ్వడంతో పాటు.. భాగస్వామ్యాలు విడగొడుతూ సారథికి అదనపు బలంగా మారాడు. 2022లో టీమిండియా తరఫున అత్యధిక వన్డే వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచిన సిరాజ్.. ఈ ఏడాది అదే జోరు కొనసాగిస్తున్నాడు.
21 మ్యాచ్‌ల్లోనే టాప్ ప్లేస్‌కు..
ఉప్పల్ స్టేడియంలో ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో నాలుగు వికెట్లతో విజృంభించిన సిరాజ్.. రెండో మ్యాచ్‌లోనూ జోరు కనబర్చాడు. దీంతో తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అతడు అగ్రస్థానానికి చేరుకున్నాడు. జాతీయ జట్టులోకి వచ్చీరావడంతోనే మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరేందుకు 31 మ్యాచ్‌లు అవసరం కాగా.. సిరాజ్ 21 వన్డేల్లోనే ఆ ఘనత సాధించాడు. గతేడాది సిరాజ్ ప్రదర్శనకు గానూ.. ఐసీసీ అత్యుత్తమ జట్టులోనూ సిరాజ్‌కు చోటు దక్కింది. సీనియర్ ఆటగాళ్లందరినీ తోసిరాజని సిరాజ్ ఈ అవకాశం దక్కించుకున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి విరాట్ కోహ్లీని అన్నలా భావించే సిరాజ్.. ఐపీఎల్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తరఫున ఆడే సమయంలోనే మరింత రాటుదేలిన విషయం తెలిసిందే. వచ్చే నెలలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ జరుగనుండగా.. అందులో సిరాజ్ కీలకం కానున్నాడు. అదేవిధంగా ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్‌లోనూ సిరాజ్ చోటు దక్కించుకోవడం ఖాయంగానే కనిపిస్తున్నది. పుష్కర కాలం తర్వాత సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్‌లో టీమిండియాకు కప్పు సాధించడమే లక్ష్యంగా సిరాజ్ సాధన కొనసాగిస్తున్నాడు. అతడి ప్రయత్నాలు ఫలించాలని మనమూ ఆశిద్దాం!