||ప్రతీకాత్మక చిత్రం ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా||
ఈవార్తలు, ఈ-ముచ్చట: టీమిండియాలో మహేంద్ర సింగ్ ధోని తర్వాత ఆ స్థాయిలో కెప్టెన్సీ చేసిన ఆటగాడు మరొకరు లేరు. విరాట్ కోహ్లీ మంచి కెప్టెన్సీ చేసినా కీలక టోర్నమెంట్లలో జట్టును సరిగ్గా నడిపించలేకపోతున్నాడని పక్కనబెట్టారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను విజయవంతంగా నడిపిస్తున్న రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించారు. ఆటగాడిగా, టెక్నిక్ పరంగా మరే ఆటగాడు సాటిరాని రోహిత్ శర్మ.. ఇప్పుడు పరుగులు చేయడం మర్చిపోయాడు. ఐపీఎల్‌లో విజయవంతమైతే కావచ్చు.. కానీ, దేశానికి ప్రాతినిథ్యం వహించేటప్పుడు ఎన్నో ఒత్తిడులు ఉంటాయి. వాటన్నింటినీ అధిగమించాలి. రోహిత్ శర్మకు ఆ స్థాయి ఉంది. కెప్టెన్సీ ఒక్కటే సరిపోదు.. తాను ముందుండి నడిపించాలి. తానూ పరుగులు చేయాలి. అలా చేయలేక.. వరుస టోర్నీల్లో తేలిపోయాడు. దాంతో పేలవ కెప్టెన్సీ అని ముద్ర పడింది.
భవిష్యత్తు టీమిండియాకు మిస్టర్ కూల్ లాంటి కెప్టెన్ అయితేనే బాగుంటుందని సదరు క్రీడాభిమాని కోరుకుంటున్నాడు. అదే సమయంలో దూకుడు, సందర్భాన్ని బట్టి నిమిషాల్లో నిర్ణయాలు తీసుకొనే సత్తా ఉండాలి. కానీ, జట్టును ఆగం చేసే ఆటగాడు నాయకుడిగా రాణించలేడు. ఇప్పుడు భారత క్రికెట్ ఎదుర్కొంటున్నది ఇదేనని క్రీడా పండితులు చెప్తున్న మాట. ఈ మాట అంటున్నది హార్దిక్ పాండ్యాను ఉద్దేశించే. వాస్తవానికి హార్దిక్ పాండ్యా కెప్టెన్ స్థాయి ఆటగాడు కాదు. ఆల్‌రౌండర్ మాత్రమే. అదీ.. అంతంత మాత్రమే ఉండే బౌలింగ్. బ్యాటింగ్ కూడా జట్టును కీలక సమయాల్లో ఆదుకొనే స్థాయిలో ఉండదు. దీనికంతటికీ అనుభవలేమి కారణం. పరిణతి సాధిస్తే గొప్ప ఆటగాడు అవుతాడు. ఐపీఎల్‌లో గుజరాత్ నాయకత్వ బాధ్యతలు చేపట్టి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. అది ఐపీఎల్ స్థాయి వరకే.
టీమిండియాకు వచ్చే సరికి.. క్రికెట్ అంటే దేశ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం. ఇక్కడ ప్రతి నిర్ణయం దేశానికి, దేశ ప్రజలకు మేలు చేసేలా ఉండాలి తప్ప, ఆగమాగం ఉండొద్దు. అలాంటి అనుభవలేమి శ్రీలంకతో జరుగుతున్న టీ20ల్లో కనిపిస్తోంది. తొలి టీ20లో ఓడిపోయే పరిస్థితే. రెండో టీ20లో పేలవ కెప్టెన్సీ అని నిరూపించింది. టీమిండియా పెద్ద మనుషులు కెప్టెన్సీ ఇచ్చేప్పుడు సత్తా, సామర్థ్యం, అణుకువ, సమయస్ఫూర్తిని బట్టి కెప్టెన్సీని నిర్ణయించరా? కేవలం రాజకీయ కోణంలోనే నిర్ణయాలు తీసుకుంటారా? గుజరాత్‌కు ప్రాతినిథ్యం వహించాడని, ఆ జట్టుకు కప్ తెచ్చిపెట్టాడని ఏకంగా టీమిండియా కెప్టెన్సీ ఇచ్చేస్తారా? అని సదరు క్రీడాభిమాని ప్రశ్నిస్తున్నాడు. సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని తూర్పారబడుతున్నారు.
జట్టు గెలవడానికే నిర్ణయాలు ఉండాలి.. ప్రయోగాలు చేయాలి గానీ ఇష్టమొచ్చినట్టు జట్టును ఆగం చేస్తే ఎలా? అని నిలదీస్తున్నారు. క్రీడా నిపుణులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాలో నాయకత్వ లక్షణాలు ఉన్న ఆటగాళ్లకు కొదవలేదు. రోహిత్ శర్మ తర్వాత జట్టు బాధ్యతలు తీసుకొనే నాయగాడు కూల్‌గా, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవాలని, ఆగం చేస్తూ నిర్ణయాలు తీసుకొనే ఆటగాడు అవసరం లేదని కుండబద్ధలు కొడుతున్నారు.