టీమిండియా జట్టులో తెలుగువాళ్లది ఎప్పటికీ ప్రత్యేక స్థానమే. ప్రస్తుత కాలమానంలో తెలిసిన వీవీఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడు.. తాజా సంచలనం నితీశ్ కుమార్ లాంటి ఎందరో క్రికెటర్లు నేటి తరానికి సుపరిచితమే. కానీ.. అసలు టీమిండియాకు తొలి ఇద్దరు కెప్టెన్లు తెలుగువాళ్లేనన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు.
సీకే నాయుడు, మహారాజ్ కుమార్
ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్ : టీమిండియా జట్టులో తెలుగువాళ్లది ఎప్పటికీ ప్రత్యేక స్థానమే. ప్రస్తుత కాలమానంలో తెలిసిన వీవీఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడు.. తాజా సంచలనం నితీశ్ కుమార్ లాంటి ఎందరో క్రికెటర్లు నేటి తరానికి సుపరిచితమే. కానీ.. అసలు టీమిండియాకు తొలి ఇద్దరు కెప్టెన్లు తెలుగువాళ్లేనన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. వారే.. కొట్టారి కనకయ్య నాయుడు (CK Naidu), మహరాజ్ కుమార్. వీరిలో సీకే నాయుడు తెలుగువాడే అయినా.. పుట్టి పెరిగింది మహారాష్ట్రలోని నాగపూర్‌లో. మహరాజ్ కుమార్‌ది విజయనగరం. ఆయన అప్పటి విజయనగర రాజు అయిన పూసపాటి విజయ రామ గజపతి రాజు రెండో కుమారుడు. పూర్తి పేరు పూసపాటి విజయ ఆనంద గజపతి రాజు(విజ్జీ).
సీకే నాయుడు 1895 అక్టోబర్ 31న తెలుగు కుటుంబంలో జన్మించారు. పాఠశాల రోజుల నుంచే క్రికెట్‌లో ప్రతిభ కనబర్చారు. ఆరు దశాబ్దాలపాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు. రిటైర్ అయ్యాక కొన్నేళ్లు సెలెక్టర్‌గా, రేడియో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సీకే నాయుడు 1967లో ఇండోర్‌లో మరణించారు. ఆయన పూర్వీకులు ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందినవారు. ఈయన తాత కొట్టారి నారాయణస్వామి నాయుడుకు రెండు తరాలకు ముందే.. వాళ్ల కుటుంబం హైదరాబాద్‌కు వలస వచ్చింది. నారాయణస్వామి నాయుడు తాత నిజాం వద్ద దుబాసీగా పనిచేశారు. తర్వాత వాళ్లు ఔరంగాబాద్‌కు మకాం మార్చారు. సీకే నాయుడు తండ్రి సూర్యప్రకాశరావు నాయుడు హోల్కర్ సంస్థానంలో జడ్జిగా పనిచేస్తూ, నాగపూర్లో స్థిరపడ్డారు. ఇంట్లో తెలుగు వాతావరణం ఉండటంతో సీకే నాయుడు తెలుగు సంప్రదాయాలను పాటించేవారు. తెలుగు చదవటం, తెలుగు వస్త్రధారణలోనే ఉండేవారు. సీకే నాయుడు మరణాంతరం మచిలీపట్నంలోని ఒక వీధికి సీకే పేరు పెట్టారు.
భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్‌గా సీకే నాయుడు బాధ్యతలు చేపట్టారు. తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ 1916లో ఆడారు. ఆయనది 48 ఏళ్ల సుదీర్ఘ కెరీర్. 50 ఏళ్ల దాటాక కూడా డబుల్ సెంచరీ చేసిన ఘనుడు. విజ్డెన్ పత్రిక క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన తొలి భారత క్రికెటర్ ఈయనే. సీకే నాయుడుకు 1955లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అందజేసి సత్కరించింది.
ఇక.. 1936లో ఇంగ్లండ్ టూర్ కోసం భారత జట్టుకు విజ్జీ నేతృత్వం వహించారు. తనకు కెప్టెన్ చేసే సామర్థ్యం, ఆటపై పట్టు లేకపోయినా తన పలుకుబడితో కెప్టెన్ పదవిని చేపట్టారు. 3 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా పనిచేశారు. తన కెరీర్‌లో మొత్తం 47 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడారు. అయితే, క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక చాలా ఏళ్ల పాటు లో ప్రొఫైల్ మెయింటెన్ చేశారు. 1954-1957 మధ్య బీసీసీఐ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. దక్షిణ భారత దేశంలో క్రికెట్ అభివృద్ధికి తీవ్ర కృషి చేశారు. 1958లో ఈయనకు భారత ప్రభుత్వం పద్మ భూషణ్‌తో సత్కరించింది. అనంతరం విశాఖపట్నం ఎంపీగానూ పనిచేశారు.