Team India | టెస్ట్ కెప్టెన్సీకి అతడే సరైన వ్యక్తి.. మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు

టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తప్పించాలని అన్నాడు.

kaif rohit sharma

మహ్మద్ కైఫ్, రోహిత్ శర్మ

న్యూఢిల్లీ : న్యూజిలాండ్ సిరీస్ వైట్ వాష్‌తో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు.. కోచ్ గౌతమ్ గంభీర్ కోచింగ్‌పైనా విమర్శకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సొంత గడ్డపై ఓడిపోవడంపై క్రికెట్ ఫ్యాన్స్ సైతం జీర్ణించుకోలేక పోతున్నారు. రోహిత్ శర్మ పనైపోయిందని, కెప్టెన్సీ చేస్తేనే సరిపోదని.. జట్టు కోసం పరుగులు కూడా చేయాలని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. స్వదేశంలో ఒక్క మ్యాచ్ గెలవకుండా సిరీస్‌ను వైట్ వాష్ చేయించుకున్న తొలి భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఖాతాలో చెత్త రికార్డు నమోదైంది. దీంతో హిట్ మ్యాన్‌పై ఎప్పుడూ లేనంత వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తప్పించాలని అన్నాడు.

‘రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్‌లో పెద్దగా క్లిక్ కాలేదు. న్యూజిలాండ్‌పై కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలం అయ్యాడు. అందుకే సీనియర్లను తప్పించి, రంజీల్లో రాణిస్తున్న కుర్రాళ్లను జట్టుతో నింపాలి. ప్రస్తుతం జట్టులో రిషబ్ పంత్ ఒక్కడే పోరాట యోధుడిగా కనిపిస్తున్నాడు. కెప్టెన్ అయ్యేందుకు అతడికి అన్ని అర్హతలు ఉన్నాయి. మైదానంలోకి అడుగు పెట్టిన ప్రతీసారి జట్టు ప్రయోజనాలే లక్ష్యంగా ఆడుతున్నాడు. కాబట్టి పంత్‌ను కెప్టెన్‌గా ప్రకటించాలి.  పంత్ అన్ని పరిస్థితుల్లో పరుగులు సాధిస్తున్నాడు. విదేశీ పిచ్‌లపైనా రాణిస్తున్నాడు. పేస్, స్పిన్ అన్న తేడా లేకుండా అన్ని పిచ్‌లపై చెలరేగుతున్నాడు. కాబట్టి పంత్‌ను భావి కెప్టెన్‌గా భావించొచ్చు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పిచ్‌లపైనా పంత్ బాగా ఆడాడు’ అని అభిప్రాయపడ్డాడు.

తాను ఎంత ప్రమాదకర ఆటగాడినో పంత్ నిరూపించుకున్నాడని, న్యూజిలాండ్‌తో చివరి టెస్టులో వాంఖడే స్టేడియంలో పంత్ క్రీజులో ఉన్నంత వరకు కివీస్ ప్లేయర్లకు ఊపిరి ఆడలేదని కైఫ్ గుర్తుచేశాడు. టాపార్డర్ విఫలమైనా.. హాఫ్ సెంచరీతో కివీస్ బౌలర్లను భయపెట్టాడని కొనియాడాడు. అంపైర్ వివాదాస్పద నిర్ణయం తప్పితే.. పంత్ ఆటను తక్కువ చేయడానికి లేదని పేర్కొన్నాడు. కాగా, మరి కొన్ని రోజుల్లో ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని రోహిత్ సేన ఆడనుంది. ఈ సిరీస్‌లో గెలవడం రోహిత్‌కు కీలకం. న్యూజిలాండ్‌పై వైట్ వాష్ నుంచి కోలుకొని కంగారులపై పంజా విసరాలి. లేకపోతే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లడం సాధ్యం కాదు. నవంబర్ 22న పెర్త్‌ తొలి టెస్ట్‌తో 5 మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్