గురి చూసి కొట్టడంలో మనం మెరుగే..భారత క్రికెటర్ల ఫిట్‌నెస్‌ ప్రమాణాలు బాగున్నాయన్న ఫీల్డింగ్‌ కోచ్‌ దిలిప్‌

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం Photo: Twitter||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: బంతితో నేరుగా వికెట్లను కొట్టడంలో భారత ఆటగాళ్లు ఎంతో మెరుగయ్యారని టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌ టి. దిలిప్‌ అన్నాడు. అద్భుత ఫిట్‌నెస్‌ ప్రమాణాలతో భారత ఆటగాళ్లు చక్కటి ఫీల్డింగ్‌ ప్రదర్శన కొనసాగిస్తున్నట్లు దిలిప్‌ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో ‘బోర్డర్‌-గవాస్కర్‌’ సిరీస్‌లో టీమిండియా ఫీల్డింగ్‌ పేలవంగా ఉందనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో దిలిప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గతేడాది టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా కేఎల్‌ రాహుల్‌ చేసిన డైరెక్ట్‌ హిట్‌ రనౌట్‌ను ప్రస్తావించిన దిలిప్‌.. అలాంటి ఎఫర్ట్స్‌ వల్ల జట్టుకు ఎంతో లాభం చేకూరుతుందని అన్నాడు. ‘మేం కొన్ని విషయాల్లో చాలా మెరుగయ్యాం. ఇంకొన్ని విషయాల్లో పురోభివృద్ధి సాధిస్తునానం. డైరెక్ట్‌ హిట్‌ల విషయానికి వస్తే.. ఇటీవలి కాలంలో భారత ఆటగాళ్లు నేరుగా వికెట్లను గిరాటేసే సంఖ్య బాగా పెరిగింది. పొట్టి ప్రపంచకప్‌లో రాహుల్‌ ఒక్క త్రోతో మ్యాచ్‌ గమనాన్ని మర్చేసిన విషయం మర్చిపోకూడదు. కేవలం అవతలి బ్యాటర్‌ ఔటైన సందర్భాలనే కాకుండా.. ఆ ప్రయత్నంలో మనవాళ్లు వికెట్లను డైరెక్ట్‌ హిట్‌ చేసిన అంకెలు సంతృప్తికరంగా ఉన్నాయి’ అని అన్నాడు. 

ఫుల్‌ ప్రాక్టీస్‌

‘బోర్డర్‌-గవాస్కర్‌’ సిరీస్‌ను వరుసగా నాలుగోసారి చేజిక్కించుకున్న టీమిండియా ఇక వన్డే సమరానికి సిద్ధమవుతున్నది. శుక్రవారం వాంఖడే వేదికగా తొలి వన్డే జరుగనుండగా.. దానికోసం భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌ ప్రారంభించారు. వ్యక్తిగత కారణాల వల్ల తొలి వన్డేకు కెప్టన్‌ రోహిత్‌ శర్మ అందుబాటులో లేకుండాపోగా.. వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. బుధవారం పాండ్యా, సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌, కేఎల్‌ రాహుల్‌, కుల్దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, మహమ్మద్‌ సిరాజ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జైదేవ్‌ ఉనాద్కట్‌ సాధన కొనసాగించారు. ఆప్షనల్‌ ప్రాక్టీస్‌ కావడంతో కొందరు మాత్రమే ప్రాక్టీస్‌ చేశారు. ఈ ఏడాది చివర్లో భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ జరుగనున్న నేపథ్యంలో జట్టులో స్థానం సుస్థిరం చేసుకునేందుకు కుల్దీప్‌, చాహల్‌ కృషి చేస్తున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రమాదకర ఆటగాడిగా పరిణమించిన సూర్యకుమార్‌ యాదవ్‌తో పాటు యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ ప్రారంభించారు. హర్దిక్‌ బౌలింగ్‌లో ఇషాన్‌ భారీషాట్లు ఆడేందుకు సాధన చేయగా.. సూర్యకుమార్‌ గ్రౌండ్‌ నలువైపులా షాట్లు ఆడాడు. వీరిద్దరితో పాటు పాండ్యా కూడా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేయగా.. స్పిన్నర్లు సుదీర్ఘ స్పెల్స్‌ వేస్తూ కనిపించారు. ఇక తొలి రెండు టెస్టుల అనంతరం జట్టుకు దూరమైన కేఎల్‌ రాహుల్‌.. ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. వన్డేల్లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేయడంతో పాటు వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు మోస్తున్న రాహుల్‌ జట్టులో సమతూకం తెస్తున్నాడని ఫీల్డింగ్‌ కోచ్‌ దిలిప్‌ పేర్కొన్నాడు. బుధవారం ప్రాక్టీస్‌ సందర్భంగా టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో పాటు బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ దిలిప్‌ ఆటగాళ్లను పర్యవేక్షించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్