|| కేఎల్ రాహుల్, Photo: Twitter ||ఈవార్తలు స్పోర్ట్స్ న్యూస్: సుదీర్ఘ ఫార్మాట్‌లో రెగ్యులర్ ఓపెనర్‌గా కొనసాగుతున్న లోకేశ్ రాహుల్.. వన్డేల్లో మిడిలార్డర్‌లో బరిలోకి దిగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకైనా సిద్ధమే అని ప్రకటించాడు. టెస్టు క్రికెట్‌లో కేవలం ఆటగాడిగానే ఆడుతున్న కేఎల్ రాహుల్.. వన్డేల్లో మాత్రం వికెట్ కీపర్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అటు వికెట్ల వెనుక ప్రతిభచూపడంతో పాటు.. అనుభవరాహిత్యమున్న మిడిలార్డర్‌లో బరిలోకిదిగి జట్టును విజయతీరాలకు చేర్చుతున్నాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం జరిగిన రెండో వన్డేలో రాహుల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. టాపార్డర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయిన చోట.. తన విలువ చాటుకుంటూ రాహుల్ చక్కటి ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ‘విపరీతమైన పోటీ ఉండే భారత జట్టులో చోటు సంపాదించడమే పెద్ద విషయం. ఇక తుది జట్టులో ఉన్నామంటే ఏ స్థానంలో ఆడేందుకైనా రెడీగా ఉంటా. కెప్టెన్ రోహిత్ శర్మకు నా ఆటతీరుపై స్పష్టత ఉంది. మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయమని అతడే సూచించాడు. జట్టు ప్రయోజనాల కోసం ఎక్కడైనా ఆడుతా. వికెట్ కీపింగ్, బ్యాటింగ్ పెద్ద ఇబ్బందేం లేదు. ఐదో స్థానంలో బరిలోకి దిగడం వల్ల నా ఆటను మరింత బాగా అర్థం చేసుకోగలుగుతున్నా. మైదానంలో అడుగుపెట్టేందుకు ముందే పరిస్థితులపై అవగాహన ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బందేం ఉండదు. అదీ కాక ఎక్కువ శాతం స్పిన్నర్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నాకు బంతి బ్యాట్‌పైకి వస్తున్న సమయంలో బ్యాటింగ్ చేయడం సరదాగా అనిపిస్తుంది’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు.
రాహుల్ ఫామ్ కొనసాగించాలి: వసీం జాఫర్
శ్రీలంకతో రెండో వన్డేలో కీలక ఇన్నింగ్స్ ఆడిన రాహుల్‌పై పలువురు మాజీలు ప్రశంసలు కురిపించారు. ఏడాది కాలంగా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న రాహుల్.. ఈడెన్ గార్డెన్స్‌లో సాధికారికంగా బ్యాటింగ్ చేశాడని వసీం జాఫర్ అన్నాడు. ఈ ఇన్నింగ్స్ అతడు తిరిగి ఫామ్ అందుకోవడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. ‘చాన్నాళ్లుగా రాహుల్ ఆటతీరు పరిశీలిస్తున్నా. బ్యాటింగ్ ఆర్డర్ ప్రదర్శన బాగాలేకపోతే మన కళ్లు వెంటనే గుర్తిస్తాయి. ఏడాదిగా రాహుల్ అటతీరు చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషబ్ పంత్ వంటి వాళ్లు రాహుల్ స్థానాన్ని భర్తీ చేయడానికి రెండీ ఉన్నారు. అతడికి ప్రతి ఇన్నింగ్స్ చాలా కీలకమైంది. శ్రీలంకతో రెండో వన్డేలో రాహుల్.. జట్టు విజయానికి అవసరమైన కీలక పరుగులు చేశాడు’ అని వసీం జాఫర్ పేర్కొన్నాడు. 2019 వన్డే ప్రపంచకప్ అనంతరం జట్టుకు దూరమైన దిగ్గజ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా.. అప్పటి నుంచి మిడిలార్డర్‌లో నిలకడ కొనసాగించే ఆటగాడు కరువయ్యాడు. దీంతో ఈ అంశంపై దృష్టి సారించిన మేనేజ్‌మెంట్ రాహుల్‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు ఒప్పించింది. టెస్టు క్రికెట్‌లో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న రిషబ్ పంత్.. వన్డేల్లో చెప్పుకోదగ్గ ఆటతీరు కనబర్చకపోవడంతో 50 ఓవర్ల ఫార్మాట్‌లో రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నాడు. ఈ ఏడాది ఆఖర్లో సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో యువకులు, అనుభజ్ఞులతో కూడిన జట్టును సంసిద్ధం చేయాలని బీసీసీఐ భావిస్తున్నది.